వైసీపీ అధినేత జగన్ తాడేపల్లిలో పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. కూటమి ప్రభుత్వ అణచివేతల మధ్య ధైర్యంగా నిలిచిన వారికి అభినందనలు తెలిపారు. రాజకీయాల్లో విశ్వసనీయత, విలువలు చాలా ముఖ్యమని, తాను ఎప్పుడూ అవే పాటిస్తానని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు చూపిన తెగువకు హాట్సాఫ్ చెప్పిన జగన్, ఉప ఎన్నికల్లో 50 స్థానాల్లో 39 గెలిచామన్న మాటే వైసీపీ బలాన్ని నిరూపిస్తుందని తెలిపారు.
తెలుగుదేశం పార్టీకి ఎక్కడా గెలిచే నంబర్లు లేవని, అయినా అధికార అహంకారంతో ఎన్నికలు నిర్వహించారని ఆయన విమర్శించారు. పోలీసులు, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి బలవంతంగా గెలవాలని టీడీపీ యత్నించిందని ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో అక్రమాలు, విశాఖపట్నంలో అవిశ్వాస తీర్మానం ద్వారా దురుద్దేశాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రామగిరిలో వైసీపీ గెలిచిన 10కి 9 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు అడ్డుకోవడం కుట్రేనని తెలిపారు.
కుప్పంలో 16 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ గెలిచినా, టీడీపీ ఆరుగురిని ప్రలోభాలకు గురిచేయడం, మిగతా తొమ్మిది మందిని అడ్డుకోవడం దారుణమన్నారు. కోరం లేకున్నా టీడీపీ గెలిచినట్లు ప్రకటించుకోవడం ప్రజాస్వామ్య విధ్వంసమని విమర్శించారు. టీడీపీ చేస్తున్న ఈ అక్రమాలపై ప్రజలు గమనించాలని, ఎన్నికల్లో వారికి సరైన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
రాబోయే ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజార్టీతో గెలుస్తుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో కార్యకర్తలకు తాను చేయాల్సింది చేయలేకపోయానని, కానీ జగన్ 2.0లో వారి కోసం గట్టిగా నిలబడతానని హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం తదుపరి రోజుల్లో మరింత కృషి చేస్తానని స్పష్టం చేశారు.









