జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ బైసరన్ మైదానంలో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ఘటనలో కనీసం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై భారత క్రికెట్ లోకం గట్టిగా స్పందించింది. దేశవాళీ క్రికెటర్ శ్రీవత్స్ గోస్వామి పాకిస్థాన్‌తో ఇకపై ఎప్పటికీ క్రికెట్ ఆడకూడదని తీవ్రంగా డిమాండ్ చేశాడు.
గోస్వామి సోషల్ మీడియాలో ఓ భావోద్వేగభరిత పోస్ట్ చేసి, ఈ దాడిపై తన ఆవేదనను వ్యక్తం చేశాడు. “ఇది మళ్లీ జరిగిందంటే, ఎందుకంటే మనం మౌనంగా ఉన్నాం. ఆటలకు రాజకీయాల నుంచి స్వతంత్రత ఉండాలనే భావనను ఇకనైనా పునఃసమీక్షించాలి. వారి జాతీయ క్రీడ మన ప్రజలను హత్య చేయడమే” అని పేర్కొన్నాడు. పాకిస్థాన్‌తో క్రికెట్ కాదు, దృఢ వైఖరి అవసరమని గోస్వామి అభిప్రాయపడ్డాడు.
గోస్వామి తనకు పహల్గామ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. కొన్ని నెలల క్రితం అక్కడ లెజెండ్స్ లీగ్ సందర్భంగా తిరిగినప్పుడు, శాంతి పునఃస్థాపన మొదలైందని అనిపించిందని, కానీ ఇప్పుడు జరిగిన ఈ ఘోర ఘటన తన మనసును కలచివేసిందని చెప్పాడు. ఇకపై మౌనం వద్దని, క్రీడాస్ఫూర్తితో కాదు, స్పష్టమైన వైఖరితో స్పందించాల్సిన సమయమిదని వెల్లడించాడు.
భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్, ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. యువరాజ్, బాధిత కుటుంబాలకు ధైర్యాన్ని అందించేందుకు ప్రార్థిస్తున్నానని తెలిపాడు. గంభీర్ తన పోస్ట్‌లో, దీనికి బాధ్యులైన వారు మూల్యం చెల్లించాల్సిందేనని హెచ్చరించాడు. భారత్ ఈ దాడికి తగిన ప్రతిస్పందన ఇస్తుందని స్పష్టం చేశారు.









