ఈ రోజు, ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం పులిరాముడుగూడెంలో గిరిజన వెదురు హస్తకళల శిక్షణ, తయారీ, ప్రదర్శన కేంద్రాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ కేంద్రం గిరిజనుల నైపుణ్యాలను పెంచేలా, వారి ఆర్థిక స్వావలంబనకు కొత్త బాటలు వేస్తున్నది. మంత్రి నాదెండ్ల, స్థానికులతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలపై హామీలు ఇచ్చారు.
శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం, మంత్రి నాదెండ్ల మనోహర్ అక్కడ శిక్షకుడు మరియు దివ్యాంగుడైన మారయ్యతో ప్రత్యేకంగా మాట్లాడారు. మారయ్య నేలపై కూర్చుని ఉండటాన్ని గమనించిన మంత్రి, తాను కూడా నేలపై కూర్చొని శిక్షణా కార్యక్రమం గురించి ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మారయ్య ఈ కేంద్రంలో మూడు నెలల పాటు వెదురు హస్తకళలపై శిక్షణ ఇస్తామని వివరించారు.
అలాగే, వార్షికంగా నాలుగు బ్యాచ్లలో 200 మంది గిరిజన యువతకు శిక్షణ ఇస్తామని మారయ్య తెలిపారు. శిక్షణ పూర్తయ్యాక, బ్యాంకుల ద్వారా రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు రుణాలు అందించి, గిరిజనులుగా తమ ఉత్పత్తులు విక్రయించుకునే అవకాశాలు కల్పించాలని మారయ్య కోరారు. ఈ విషయంలో మంత్రి మనోహర్ తక్షణమే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
అనంతరం, మంత్రి నాదెండ్ల మనోహర్ గిరిజన ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో సహజ వనరులు, మంచి భూములు ఉన్నప్పటికీ, సరైన ధరల కొరత వల్ల గిరిజనులు నష్టపోతున్నారని చెప్పారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు, గిరిజన సహకార సంస్థ (జిసిసి) ను బలోపేతం చేస్తామని మంత్రి వెల్లడించారు.
స్థానికుల సమస్యలను పరిశీలించిన మంత్రి, తాగునీటి సమస్యను త్వరగా పరిష్కరించడానికి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ప్రారంభించాలని ఆదేశించారు. అలాగే, గ్రామానికి బస్సు సౌకర్యం, రోడ్ల మెరుగుదల, వైద్య సేవలపై అడిగిన ఫిర్యాదులపై స్పందిస్తూ, మే 1 నుండి బస్సు సేవలు ప్రారంభించి, రోడ్ల సమస్యను ఏడాదిలో పరిష్కరించామన్నారు.









