తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఫలితాలను విడుదల చేయనున్నారు. ప్రభుత్వ పరీక్షల విభాగం ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేసింది. ఈ ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించబడిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షల అనంతరం జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయింది. మార్కుల మెమోల రూపకల్పనలో మార్పుల కారణంగా కొంత ఆలస్యమైనా, ఇప్పుడు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఈ సంవత్సరం నుంచి పదో తరగతి మార్కుల మెమోలలో కొత్త విధానం అమలులోకి వచ్చింది. గతంలో మెమోలో కేవలం గ్రేడ్లు, సీజీపీఏ మాత్రమే ఉండేవి. ఇకపై రాత పరీక్షలు, ఇంటర్నల్స్ మార్కులు విడివిడిగా చూపిస్తారు. అలాగే, మొత్తం మార్కులు, గ్రేడ్లు, విద్యార్థి ఉత్తీర్ణతను స్పష్టంగా పేర్కొననున్నారు. ఇది విద్యార్థులకు పూర్తి అవగాహన కలిగించే విధంగా ఉంటుంది.
కేవలం విద్యా పాఠ్యాంశాలకే కాకుండా, బోధనేతర రంగాల్లో విద్యార్థుల ప్రతిభను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. వాల్యూ ఎడ్యుకేషన్, కళా, పని మరియు కంప్యూటర్ విద్య, శారీరక ఆరోగ్య విద్య వంటి విభాగాల్లో కూడా గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఇవన్నీ మార్కుల మెమోలో స్పష్టంగా ముద్రించనుండటం విశేషం. విద్యార్థుల అర్హతలు, సామర్థ్యాలను సమగ్రంగా అంచనా వేయడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది.









