భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ తీవ్ర నష్టాలను మూటగట్టుకుంది. భారత సైన్యం రానున్న 24 నుంచి 36 గంటల్లో దాడికి దిగొచ్చని పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించాయి. దీంతో మదుపుదారులు భారీగా అమ్మకాలకు దిగారు.
బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి పాకిస్థాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లోని కేఎస్ఈ-100 సూచీ ఏకంగా 3,545 పాయింట్లకు పైగా పతనమైంది. ఇది 3.09 శాతం నష్టాన్ని సూచిస్తోంది. మంగళవారం 114,872 వద్ద ముగిసిన సూచీ, బుధవారం 111,326 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే మార్కెట్‌పై అమ్మకాల ఒత్తిడి హావం చీల్చింది.
పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ప్రతిస్పందించవచ్చన్న మంత్రి అతవుల్లా తరార్ వ్యాఖ్యలు స్టాక్ మార్కెట్ సెంటిమెంట్‌ను బాగా దెబ్బతీశాయి. ఇస్మాయిల్ ఇక్బాల్ సెక్యూరిటీస్ సీఈఓ అహ్ఫాజ్ ముస్తఫా మాట్లాడుతూ, “ఈ వ్యాఖ్యలతో పెట్టుబడిదారులు భయంతో ఈక్విటీల నుంచి నిధులను ఉపసంహరించుకుంటున్నారు,” అన్నారు.
ఈ పరిస్థితిలో మదుపుదారులు తిరిగి మదుపు రంగంలోకి రావాలంటే స్పష్టత అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదరకపోతే మార్కెట్ తిరిగి స్థిరపడే అవకాశముందని అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం భద్రతా పరిస్థితులపైనా, రాజకీయ ప్రకటనలపైనా మదుపుదారుల శ్రద్ధ ఎక్కువగా ఉంది.









