ముంబైలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేవ్స్ (వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్) సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ హాజరై తన జీవిత ప్రయాణం, ఫిట్‌నెస్ రహస్యాలను పంచుకున్నారు. సినీ, వినోద రంగ ప్రముఖుల సమక్షంలో ఆయన మాటలు హర్షాతిరేకం కలిగించాయి.
అల్లు అర్జున్ మాట్లాడుతూ, శారీరక దృఢత్వానికి మానసిక ప్రశాంతత ఎంతో అవసరమన్నారు. సిక్స్ ప్యాక్ కోసం ఎంత కష్టపడ్డానో గుర్తు చేసుకున్నారు. చిన్నతనంలో నుంచే డ్యాన్స్ పట్ల ఉన్న మక్కువ తన కెరీర్‌ను ముందుకు నడిపిందని చెప్పారు. ఎన్నో సవాళ్లు ఎదురైనా ప్రేక్షకుల ప్రేమే తనను నిలబెట్టిందన్నారు.
“సినిమానే నా ప్రపంచం. నా లక్ష్యం ఒక్కటే – ప్రేక్షకులను మెప్పించాలి. ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించను కానీ, ప్రతిసారీ మెరుగ్గా కనిపించేందుకు ప్రయత్నిస్తాను” అని పేర్కొన్నారు. తన కుటుంబం ఇచ్చిన మద్దతు తన ఎదుగుదలకు కీలకమన్నారు. అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్, చిరంజీవి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
తన 18వ సినిమా ఫెయిలయ్యాక ఎదురైన పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో వచ్చిన విమర్శలు తనను ఆత్మవిమర్శ చేసుకునేలా చేశాయని చెప్పారు. ఆ సమయంలో మంచి డ్యాన్సర్‌గా తనను తాను అభివృద్ధి చేసుకున్నానని, ట్రైనర్ సహాయంతో మరింతగా మెరుగయ్యానని వివరించారు. తనను ప్రేరేపించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.









