చారిత్రక కట్టడం తాజ్ మహల్ పరిరక్షణకు సంబంధించి సుప్రీం కోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. తాజ్ మహల్‌కు 5 కిలోమీటర్ల పరిధిలో చెట్లను నరికివేయాలంటే తమ ముందస్తు అనుమతి తప్పనిసరి అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు 2015లో జారీ చేసిన ఆదేశాలను మళ్లీ గుర్తు చేస్తూ, వాటిని కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.
తాజ్ ట్రెపీజియం జోన్ పరిధిలో చెట్ల నరికివేత అంశం పరిశీలనలో ఉండగా, కోర్టు ఈ సందర్భంలో స్పష్టమైన మార్గదర్శకాలను ప్రకటించింది. 5 కిలోమీటర్ల పరిధిలోకి వచ్చే ఏ ప్రాంతంలోనైనా చెట్లను తొలగించాలంటే, కేంద్ర సాధికారిక కమిటీ (సీఈసీ) లేదా సంబంధిత డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌ఓ) అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. 50కంటే తక్కువ చెట్లు అయినా అనుమతి అవసరమేనని తేల్చింది.
తాజ్ మహల్ 5 కిమీ పరిధిలోని ప్రాంతాల్లో చెట్ల నరికివేత అనుమతికి ముందు, అక్కడి పర్యావరణ పరిస్థితులు, పరిరక్షణ నిబంధనలు పరిశీలించాల్సి ఉంటుందని ధర్మాసనం వివరించింది. అత్యవసర పరిస్థితులకే మినహాయింపు వర్తించనున్నదని పేర్కొంది. అదీ తక్షణ ప్రమాదం ఉంటే తప్ప, మినహాయింపు వర్తించదని ధర్మాసనం స్పష్టం చేసింది.
సుమారు 10,400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న టీటీజడ్ పరిధి ఉత్తరప్రదేశ్‌లోని ఐదు జిల్లాలు, రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాను కలిగి ఉంది. తాజ్ మహల్‌ను కాలుష్య బారినుంచి కాపాడేందుకే ఈ ఆదేశాలు భాగమని కోర్టు పేర్కొంది. ఈ మార్గదర్శకాలు పరిరక్షణ చర్యలకు దిశానిర్దేశకంగా నిలుస్తాయని వ్యాఖ్యానించింది.









