వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో మధుమేహం ఉన్నవారికి ఇది ఒక అదనపు సవాల్‌గా మారుతుంది. ఈ వేడి పరిస్థితులు శరీరంలోని ఇన్సులిన్ పనితీరును ప్రభావితం చేస్తాయి. ఫలితంగా, బ్లడ్ షుగర్ స్థాయిలను సమతుల్యం చేయడం కష్టం అవుతుంది. వేడి వల్ల ఇన్సులిన్ శోషణ మారవచ్చు, షుగర్ లెవెల్స్ ఆకస్మికంగా పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది.
డీహైడ్రేషన్ వేసవిలో ప్రధాన సమస్య. నీరు తక్కువ వల్ల రక్తంలో చక్కెర గాఢత పెరిగి షుగర్ స్థాయిలు పెరిగిపోతాయి. అధిక దాహం, అలసట, తల తిరగడం వంటి లక్షణాలు దీన్ని సూచిస్తాయి. ఇలాంటి లక్షణాలను గమనించి వెంటనే నీరు తాగడం, విశ్రాంతి తీసుకోవడం అవసరం. మధుమేహం ఉన్నవారిలో వేడి సంబంధిత అనారోగ్యాల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
వేసవిలో రోజూ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను పర్యవేక్షించడం చాలా ముఖ్యం. తగిన వ్యాయామం చేయడం మంచిదే కానీ ఎక్కువ వేడిలో శారీరక శ్రమను తగ్గించాలి. మధ్యాహ్న వేళల్లో బయట తిరగడం తగ్గించుకోవాలి. శరీర సంకేతాలను గమనించి విశ్రాంతి తీసుకోవడం అవసరం. వేడి వల్ల గుండెపై ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
చలికాలం లాగానే వేసవిలో కూడా చక్కెర స్థాయిలను సమతుల్యంలో ఉంచడం కోసం సరైన ఆహారం, నీటి తాగడం, దుస్తుల ఎంపిక కీలకం. లేత రంగు, వదులుగా ఉండే దుస్తులు వేసుకోవాలి. పుచ్చకాయ, దోసకాయ వంటి తేమ శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే వేసవి వేడి మధుమేహాన్ని ప్రభావితం చేయకుండా నియంత్రణలో ఉంచవచ్చు.









