2025 కెనడా ఫెడరల్ ఎన్నికలు పంజాబీ డయాస్పోరా రాజకీయ ప్రాధాన్యతకు మారుపేరు లాగా నిలిచాయి. ఈసారి మొత్తం 22 మంది పంజాబీ మూలాలను కలిగిన అభ్యర్థులు ఎంపీగా ఎన్నికవడం చరిత్రలో మునుపెన్నడూ లేని ఘట్టం. హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యులలో వారిది 6 శాతం ప్రాతినిధ్యం. ఇది కెనడాలో భారతీయ, ముఖ్యంగా సిక్కు సమాజ రాజకీయ ప్రవేశానికి బలమైన సంకేతంగా భావించబడుతోంది.
బ్రాంప్టన్ నగరంలో పంజాబీల ప్రభావం స్పష్టంగా కనిపించింది. బ్రాంప్టన్ నార్త్ నుంచి లిబరల్ పార్టీ అభ్యర్థి రూబీ సహోతా విజయాన్ని అందుకోగా, ఈస్ట్ నియోజకవర్గంలో మణిందర్ సిద్ధూ విజయదండం ఎగురవేశారు. కానీ బ్రాంప్టన్ సౌత్‌లో కాన్జర్వేటివ్ అభ్యర్థి సుఖ్‌దీప్ కాంగ్ విజయం సాధించారు. పలు నియోజకవర్గాల్లో పంజాబీలు ప్రధాన పోటీదారులుగా నిలిచారు.
లిబరల్ పార్టీ తరఫున అనితా ఆనంద్, బర్దీష్ చగ్గర్, అంజు దిల్లాన్, సుఖ్ ధాలివాల్ వంటి నేతలు గెలవగా, కన్జర్వేటివ్ పార్టీలో జస్‌రాజ్ హల్లన్, అమన్‌ప్రీత్ గిల్, అర్పాన్ ఖన్నా, టిమ్ ఉప్పల్, హర్బ్ గిల్ వంటి పలువురు పంజాబీ నేతలు విజయవంతమయ్యారు. ఇది రెండు ప్రధాన పార్టీల్లోను పంజాబీ సమాజ ప్రాధాన్యత పెరుగుతున్నదాన్ని సూచిస్తుంది.
కాగా, ఎన్డీపీ అధినేత జగ్మీత్ సింగ్ అనుకోని ఓటమి చవిచూశారు. బర్నబీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన మూడో స్థానానికి పరిమితమయ్యారు. అనంతరం పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం ఎన్డీపీ భవిష్యత్తుపై ప్రశ్నలు నెలకొల్పగా, పంజాబీల రాజకీయ ప్రభావం మాత్రం గణనీయంగా కొనసాగుతుంది.









