అమెరికా ప్రభుత్వంలో సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ’ (DoGE) నుంచి తాను మే నెలాఖరులో నిష్క్రమించనున్నట్లు ఎలాన్ మస్క్ వెల్లడించారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో స్పష్టంగా ప్రకటించారు. తన తర్వాత కూడా డోజ్ కార్యకలాపాలు అంతే శక్తివంతంగా కొనసాగుతాయని ఆయన తెలిపారు.
డోజ్‌ను బౌద్ధమతంతో పోల్చుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘బౌద్ధమతం ఎలా బుద్ధుడి తర్వాత కూడా కొనసాగిందో, డోజ్ కూడా నన్ను తర్వా కొనసాగుతుంది. ఇది ఒక వ్యక్తిని ఆధారపడే వ్యవస్థ కాదు. ఇది ఒక జీవన విధానం’’ అని మస్క్ అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ వ్యయాలను తగ్గించడమే డోజ్ ప్రధాన లక్ష్యమని, ఇప్పటి వరకు దాదాపు 160 బిలియన్ డాలర్ల ఆదా సాధించామని మస్క్ తెలిపారు. జూలై 2026 నాటికి ఇది ట్రిలియన్ డాలర్ల ఆదా వైపు దూసుకుపోతుందని చెప్పారు. తన నాయకత్వం లేకుండానే ఈ కార్యాలయం మరింత వేగంగా ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
డోజ్‌కు ప్రత్యేక నాయకత్వం అవసరం లేదని, ఇందులో పనిచేసే ప్రతి ఒక్కరూ ఆ తత్వాన్ని అనుసరిస్తారని తెలిపారు. ప్రజాధనాన్ని ఆదా చేయడం, ప్రభుత్వ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చడం డోజ్ ప్రధాన లక్ష్యమని మస్క్ వివరించారు. తన తర్వాత వచ్చే బృందం దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.









