భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన ప్రతిభను మరోసారి అంతరిక్షంలో చాటింది. భూమికి 500 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్న రెండు ఉపగ్రహాల మధ్య ‘స్పేస్ డాగ్‌ఫైట్’ తరహాలో అత్యంత క్లిష్టమైన విన్యాసాలు విజయవంతంగా నిర్వహించడం విశేషం. గగనతల యుద్ధ విమానాల మాదిరిగా ఈ ఉపగ్రహాలు ఒకదానికొకటి దగ్గరగా వచ్చి వ్యూహాత్మక మోహనలు చేశాయి.
ఈ విన్యాసాలు ఇస్రో ప్రతిష్టాత్మక స్పేడెక్స్ (SPADEX) మిషన్‌లో భాగంగా నిర్వహించబడ్డాయి. గంటకు 28,800 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్న ఛేజర్, టార్గెట్ అనే ఉపగ్రహాలు పరస్పర సమన్వయంతో పనులు నిర్వర్తించాయి. ఇవి స్వయంప్రతిపత్తి వ్యవస్థ ఆధారంగా రెండెజౌస్, సమీప గమనాన్ని విజయవంతంగా పూర్తిచేశాయి.
డాకింగ్, అన్‌డాకింగ్ ప్రక్రియలను రెండు సార్లు విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఈ మిషన్ కీలక మైలురాయిని సాధించింది. ఏప్రిల్ 21న విద్యుత్ బదిలీ విజయవంతంగా జరగడం ద్వారా మరో కీలక విజయం లభించింది. ఉపగ్రహాల ఇంధన సామర్థ్యం ఇంకా 50 శాతం మిగిలి ఉండటం ఈ ప్రయోగం గమనార్హమైన మరో అంశం.
ఈ ప్రయోగంతో భారత్, రష్యా, అమెరికా, చైనా తర్వాత అంతరిక్ష డాకింగ్ సాంకేతికతను ప్రదర్శించిన నాలుగో దేశంగా నిలిచింది. ఇది భవిష్యత్ చంద్రయాన్-4, భారతీయ అంతరిక్ష కేంద్ర ప్రాజెక్టులకు బలమైన పునాది వేసినట్టు ఇస్రో పేర్కొంది. భారత స్వదేశీ పరిజ్ఞాన సామర్థ్యాన్ని ఈ విజయంతో ప్రపంచానికి చాటినట్లయ్యింది.









