భారతదేశానికి సేవ చేయడానికే తాను పుట్టానని, తాను పాకిస్థాన్‌కు చెందిన వాడిని కాదని, 27 ఏళ్లుగా జమ్ముకశ్మీర్ పోలీస్ శాఖలో సేవలందిస్తున్న ఇఫ్తికర్ అలీ ఉద్వేగంతో పేర్కొన్నారు. పూంచ్ జిల్లాలోని మెన్ధార్ సబ్ డివిజన్‌కు చెందిన ఆయన ప్రస్తుతం కత్రాలో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన కుటుంబానికి పీవోకేకు చెందినవారిగా గుర్తించి బహిష్కరణ నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది.
ఇఫ్తికర్ అలీతోపాటు ఆయన ఎనిమిది మంది తోబుట్టువుల పేర్లు విదేశాలకు పంపాల్సిన జాబితాలో చేర్చారు. అధికారులు వీరిని మొదట పంజాబ్‌కు తరలించి, అక్కడి నుంచి పాకిస్థాన్ పంపేందుకు ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. అయితే, ఈ చర్యలపై అలీ కుటుంబం హైకోర్టును ఆశ్రయించడంతో జస్టిస్ రాహుల్ భారతి ఈ బహిష్కరణపై స్టే విధించారు.
ఈ నోటీసుల వెనుక తన మేనమామతో ఉన్న భూవివాదమే కారణమని అలీ ఆరోపిస్తున్నారు. “మా భూమిని కబ్జా చేసేందుకు, మాకు తప్పుడు ముద్ర వేయడమే ఈ కుట్ర వెనుక ఉద్దేశం” అని ఆయన పేర్కొన్నారు. 1965 యుద్ధంలో పీవోకేకు వెళ్లిన అలీ తల్లిదండ్రులు 1983లో తిరిగి వచ్చారు. జమ్ముకశ్మీర్ ప్రభుత్వం 1997లో వారిని శాశ్వత నివాసితులుగా గుర్తించినా, కేంద్రంలో పౌరసత్వ దరఖాస్తు పెండింగ్‌లో ఉంది.
“నా దేశం కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఇది నా మట్టీ, నా కుటుంబం ఇక్కడే పదకాలుగా జీవిస్తోంది. నన్ను పాకిస్థాన్‌కు పంపిస్తే అది న్యాయమేనా?” అంటూ అలీ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంక్షోభ సమయంలో తమకు అండగా నిలిచిన న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారత్‌లోని ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థపై తనకు అమితమైన విశ్వాసముందని అన్నారు.









