ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందే మిస్ వరల్డ్ పోటీలు ఈ నెల 10న హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రముఖ నటుడు సోనూసూద్ మాట్లాడారు. మిస్ వరల్డ్ కేవలం అందాల పోటీగా కాకుండా, ఇందులో ఒక మంచి లక్ష్యం దాగి ఉందని ఆయన తెలిపారు. ఈ పోటీలు యువతికి శక్తిని, స్ఫూర్తిని అందించగలవని అభిప్రాయపడ్డారు.
సోనూసూద్ మాట్లాడుతూ, “ఇది ఒక గొప్ప వేదిక. ప్రతి అమ్మాయి తన ప్రతిభను ప్రదర్శించుకునే అవకాశం ఇది. అందాన్ని మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం, సామాజిక సేవలో నిబద్ధతను కూడా ఈ పోటీలు ప్రోత్సహిస్తాయి” అని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పాజిటివ్ మెసేజ్ సమాజానికి చేరుతుందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను సోనూసూద్ గట్టిగా ప్రశంసించారు. విమానాశ్రయం నుంచి హోటల్స్ వరకూ ప్రతి అతిథికి ఉత్తమ వసతులు కల్పించారని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహణతో తెలంగాణ తన సత్తా చూపించిందన్నారు. “ఇది తెలంగాణ కోసం గర్వకారణం” అని అన్నారు.
రానున్న 25 రోజులు ఎంతో ప్రత్యేకమవనున్నాయని, ఈ అవకాశాన్ని తెలంగాణ అత్యుత్తమంగా ఉపయోగించుకోవాలని సోనూసూద్ ఆకాంక్షించారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణలో తెలంగాణకు మించిన మరొకరు ఉండరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించే ఈ ఈవెంట్‌తో రాష్ట్ర ప్రతిష్ట మరింత పెరుగుతుందని అన్నారు.









