శ్రీ సిటీలో రూ.5000 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మించనున్న ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమం ఇవాళ ఘనంగా జరిగింది. భారతీయ సంప్రదాయాల ప్రకారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, ఎల్జీ ప్రతినిధులు హాజరయ్యారు. భూమి పూజ నేపథ్యంలో జరిగిన ప్రతి కార్యాచరణ శాస్త్రోక్తంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కొరియా దేశానికి చెందిన ఎల్జీ ప్రతినిధులు పాదరక్షలతోనే పూజా ప్రాంగణంలోకి వచ్చారు. ఇది గమనించిన మంత్రి నారా లోకేశ్, భారతీయ సంప్రదాయాలను గౌరవిస్తూ, పూజ సమయంలో పాదరక్షలు తొలగించాల్సిన అవసరాన్ని సున్నితంగా వివరించారు. దీనిపై కోరియన్ ప్రతినిధులు అప్రతిహతంగా స్పందించి పాదరక్షలు తొలగించి, భూమిపై కూర్చుని పూజలో శ్రద్ధగా పాల్గొన్నారు.
వారు కొబ్బరికాయలు కొట్టి, ఇతర పూజా కార్యక్రమాలను కూడా శ్రద్ధతో నిర్వహించడం అందరినీ ఆకట్టుకుంది. ఈ సంఘటన భారతీయ సంస్కృతి విలువలు, ఆతిథ్యానికి ఉదాహరణగా నిలిచింది. మంత్రి లోకేశ్ చొరవ, విదేశీయుల గౌరవభావం ఈ కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాయి.
ఈ ఉత్పాదక కేంద్రం పూర్తయిన తర్వాత 2000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. అంతేకాదు, దేశీయంగా వినియోగించే ఏసీ ఉత్పత్తుల్లో 70 శాతం వరకు అవసరాలను ఈ ప్లాంట్ నుంచే తీర్చాలని ఎల్జీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల రాష్ట్ర ఆర్ధికాభివృద్ధికి ఇది ముఖ్యంగా నిలవనుంది.









