అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఏప్రిల్ నెలలో దాదాపు అన్ని వాణిజ్య భాగస్వామ్య దేశాలపై భారీ సుంకాలను విధించిన తరువాత, మొట్టమొదటి వాణిజ్య ఒప్పందాన్ని యునైటెడ్ కింగ్డమ్ (యూకే)తో కుదిరినట్లు గురువారం ప్రకటించారు. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని అనుకుంటున్నారు.
వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో, ట్రంప్, యూకే ప్రధానమంత్రి కీర్ స్టామర్ ఫోన్ ద్వారా పాల్గొని ఈ ఒప్పందాన్ని ప్రకటించారు. ట్రంప్ ఈ ఒప్పందాన్ని తన ‘ట్రూత్ సోషల్’ వేదికపై కూడా వెల్లడించారు. “గత అధ్యక్షులు పట్టించుకోని విధంగా, ఇది అమెరికాకు మొట్టమొదటి న్యాయమైన, బహిరంగ, పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం. మన బలమైన మిత్రదేశమైన యూకేతో కలిసి, ఈ చారిత్రక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం” అని ట్రంప్ పేర్కొన్నారు.
ఈ ఒప్పందం ద్వారా, యూకే తమ దేశ మార్కెట్‌ను మరింతగా తెరుస్తోందని, అమెరికా వస్తువులకు కస్టమ్స్ ప్రక్రియలో ఎటువంటి అధికార జాప్యం లేకుండా వేగంగా అనుమతులు లభిస్తాయని ట్రంప్ తెలిపారు. “ఇరువైపులా వాణిజ్యం చాలా వేగంగా జరుగుతుంది” అని ఆయన అన్నారు.
ఒప్పందం పూర్తి వివరాలు ఇంకా ఖరారు కానప్పటికీ, ట్రంప్ కొన్ని కీలక అంశాలను వెల్లడించారు. “ఈ డీల్ ద్వారా, 10% సుంకాల నుంచి అమెరికాకు 6 బిలియన్ డాలర్ల ఆదాయం, పశువుల పెంపకందారులు, రైతులు, ఉత్పత్తిదారులకు 5 బిలియన్ డాలర్ల కొత్త ఎగుమతి అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు. అలాగే, అల్యూమినియం, ఉక్కు వాణిజ్య మండలి ఏర్పాటుతో, సురక్షితమైన ఔషధ సరఫరా వ్యవస్థ ద్వారా అమెరికా, యూకేలు జాతీయ భద్రత పెంపొందించుకోగలుగుతాయని ట్రంప్ వివరించారు.
ఫోన్లో పాల్గొన్న యూకే ప్రధాని కీర్ స్టామర్ మాట్లాడుతూ, “ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందాన్ని ప్రకటించడం నిజంగా అద్భుతమైన, చారిత్రక దినం. మనం కలిసికట్టుగా పనిచేసే చరిత్రకు ఇది నిదర్శనం” అని హర్షం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే, అమెరికా ప్రస్తుతం భారత్‌తో సహా పలు దేశాలతో వాణిజ్య చర్చలు జరుపుతోంది. భారత్‌తో కూడా త్వరలోనే ఓ ఒప్పందం కుదురుతుందని అమెరికా అధికారులు ధీమా వ్యక్తం చేశారు. అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన చైనాతో శనివారం స్విట్జర్లాండ్‌లో మొదటి వాణిజ్య చర్చలు జరగనున్నాయి.









