సమోసా ఘర్షణ… రాకేశ్‌ హత్యతో కలకలం

A samosa dispute in Gurugram turned fatal as Rakesh was shot dead. Police vow arrest within 48 hours amid public outcry.

హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సమోసా విషయంలో తలెత్తిన గొడవ ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసింది. ఫరూఖ్‌నగర్ ప్రాంతంలో రాకేశ్ అనే వ్యక్తి టీ స్టాల్ నడుపుతున్నాడు. ఈ నెల 12న పాత నేరస్తుడైన పంకజ్ తన అనుచరులతో కలిసి రాకేశ్‌ టీ స్టాల్‌కు వచ్చాడు. అప్పట్లో సమోసా విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవను అక్కడికి వచ్చిన పోలీసులు శాంతింపజేసి, పంకజ్‌ను అక్కడి నుంచి పంపించారు.

అయితే ఈ పరిణామం ఇక్కడితో ముగియలేదు. మరుసటి రోజు పంకజ్‌ తన అనుచరులతో తిరిగి అక్కడికి వచ్చి తుపాకీతో రాకేశ్‌పై ఆరు సార్లు కాల్పులు జరిపాడు. రాకేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని మృతదేహాన్ని చూసిన స్థానికులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేస్తూ వ్యాపారులు తమ షాపులను మూసేశారు. ఫరూఖ్‌నగర్-ఝజ్జర్ రహదారిని దిగ్బంధించారు.

ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను సమాధానపర్చే ప్రయత్నం చేశారు. నిందితులను 48 గంటల్లో అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. రాకేశ్‌ హత్యపై కేసు నమోదు చేసి, పంకజ్‌తో పాటు అతడి అనుచరుల కోసం గాలింపు కొనసాగుతోంది. పోలీస్ బృందాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

ఇక రాకేశ్ కుటుంబం మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. గతంలోనే పంకజ్‌పై చర్యలు తీసుకుని ఉంటే, ఈ దుర్గటన జరిగేది కాదని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు తమకు న్యాయం చేసే వారెవరు అంటూ కన్నీరుమున్నీరు అవుతున్నారు. పోలీసులు నిర్లక్ష్యం చేసిన కారణంగానే తమ కుటుంబం ఇలా శోకసాగరంలో మునిగిందని వాపోతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share