ప్రపంచవ్యాప్తంగా మధుమేహం తీవ్రంగా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో, అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య (IDF) ఒక కొత్త రకం మధుమేహాన్ని అధికారికంగా గుర్తించింది. దీన్ని ‘టైప్ 5 డయాబెటిస్’ గా పిలుస్తున్నారు. ఈ రకం మధుమేహం ప్రధానంగా పోషకాహార లోపంతో బాధపడే, సన్నగా ఉన్న యువతలో ఎక్కువగా కనిపిస్తుంది. గతంలో ఈ వ్యాధిని తక్కువ గమనించి తప్పుగా నిర్ధారణ చేస్తున్న సందర్భాలు ఎక్కువగా ఉండేవి. అయితే ఇప్పుడు దీని గుర్తింపుతో మధుమేహ పరిశోధనలో కొత్త దశ ప్రారంభమవుతుంది.
టైప్ 5 డయాబెటిస్‌ను ‘మాల్న్యూట్రిషన్-రిలేటెడ్ డయాబెటిస్ మెల్లిటస్’ (MRDM) లేదా ‘మెచ్యూరిటీ-ఆన్సెట్ డయాబెటిస్ ఆఫ్ ది యంగ్’ (MODY) అని కూడా పిలుస్తారు. ఈ రకం మధుమేహం తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాల్లో, ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది. పోషకాహార లోపం కారణంగా శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడం దీనికి ప్రధాన కారణం. టైప్ 2 డయాబెటిస్‌లో ఇన్సులిన్ నిరోధకత సమస్య ఉంటే, టైప్ 5లో ఇన్సులిన్ ఉత్పత్తి లోపమే ముఖ్యంగా ఉంటుంది.
టైప్ 5 డయాబెటిస్ బాధితులు సాధారణంగా తక్కువ బరువు, తక్కువ BMI (18.5 కిలోల కంటే తక్కువ) కలిగివుంటారు. ఇన్సులిన్ స్థాయిలు తక్కువగా ఉండటం, అలాగే ప్రోటీన్లు, పీచుపదార్థాలు, సూక్ష్మపోషకాల లోపం ఈ వ్యాధి లక్షణాలలో ముఖ్యమైనవి. కొంతమేర జెనెటిక్ కారణాలు కూడా దీనికి బాధ్యత వహిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది త్వరగా గుర్తించి, సరైన చికిత్స పొందడం ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది ఇతర మధుమేహ రకాలతో భిన్నంగా ఉండటమే ప్రత్యేకత. టైప్ 1 డయాబెటిస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలపై స్వయం ప్రతిరక్షక దాడి ఉంటే, టైప్ 2లో ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉంటుంది. టైప్ 3, 4 డయాబెటిస్ ప్రత్యేక కారణాలతో సంభవిస్తాయి. కానీ టైప్ 5 మధుమేహం ప్రత్యక్షంగా పోషకాహార లోపంతో ముడిపడి ఉండటం ప్రధాన విషయం. ఐడీఎఫ్ దీన్ని గుర్తించడం ద్వారా ఈ వ్యాధిపై మరింత అవగాహన పెరిగి, మెరుగైన చికిత్సలు అందుబాటులోకి రానుందని ఆశిస్తున్నారు.









