భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం చైనా పాకిస్థాన్‌కు సైనికంగా అండగా నిలిచిందా? అన్న ఊహాగానాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ తాజాగా స్పందించారు. పాకిస్థాన్‌కు సైనిక సహాయం అందించారన్న ఆరోపణలను ఆమె ఖండించారు. భారత్, పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలపై చైనా ఎప్పటిలాగే తటస్థంగా ఉందని స్పష్టం చేశారు.
ఇరుదేశాల మధ్య శాంతియుత వాతావరణాన్ని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని మావో నింగ్ తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందానికి తమ ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తుందని చెప్పారు. భారత-పాక్ మధ్య చెలరేగే ఏ యుద్ధ పరిస్థితినైనా నియంత్రించేందుకు చైనా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుందని వివరించారు. అప్రచారాలను నమ్మవద్దని పరోక్షంగా సూచించారు.
ఇక ఆపరేషన్ సిందూర్‌లో భారత్ నిర్వహించిన ఉగ్రవాద స్థావరాలపై దాడులు పాక్ సైన్యాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. పీఓకే సహా పాకిస్థాన్ లోపల ఉన్న ఉగ్ర శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ దాడుల నుంచి తమను రక్షించేందుకు ఉన్న చైనా తయారీ గగనతల రక్షణ వ్యవస్థలు విఫలమయ్యాయని తెలుస్తోంది. పాకిస్థాన్ వాడుతున్న హెచ్‌క్యూ-9, ఎల్‌వై-80 వంటి అధునాతన వ్యవస్థలు భారత క్షిపణులను గుర్తించలేకపోయాయి.
ఈ వ్యవస్థల సామర్థ్యంపై పాకిస్థాన్ ఆశలు పెట్టుకుంది. కానీ భారత ప్రయోగించిన ఒక్క క్షిపణినైనా ఆపలేకపోవడంతో పాక్ రక్షణ వ్యవస్థలపై నెగేటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తోంది. చైనాతో భద్రతా ఒప్పందాలున్నా, ప్రత్యక్ష సాయమేమీ అందలేదన్నది తాజా వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది. భారత్ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్ మాదిరిగా, ఈ సింధూర్ ఆపరేషన్ కూడా గణనీయమైన ప్రభావం చూపింది.









