తిరుపతి దాడి ఘటనపై లోకేశ్ తీవ్ర విమర్శలు

Lokesh accuses Jagan of politicizing Dalit student assault case in Tirupati, blames YSRCP followers for the incident.

తిరుపతిలో ఓ దళిత విద్యార్థి జేమ్స్‌పై జరిగిన దాడి ఘటనపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వాడుకుంటున్నారని ఆరోపించారు. దాడిలో పాల్గొన్న వ్యక్తులు వైసీపీ నాయకుల అనుచరులేనని స్పష్టం చేశారు. అయినా టీడీపీపై బురద జల్లే ప్రయత్నంలో జగన్ తన మీడియా కరపత్రిక “సాక్షి”ను వినియోగిస్తున్నారని మండిపడ్డారు.

లోకేశ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ నెల 15వ తేదీన జేమ్స్ అనే విద్యార్థిని కిడ్నాప్ చేసి దాడి చేశారు. దీనిపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఏడు మందిపై కేసులు నమోదు చేశారని చెప్పారు. వారిలో పలువురు వైసీపీ నేతల సన్నిహితులుగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా, పెద్దిరెడ్డి, భూమన అభినయ్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి అనుచరులు ఈ ఘటనకు సంబంధం ఉన్నట్లు ఆరోపించారు.

“వాస్తవాలు స్పష్టంగా ఉన్నా టీడీపీని విమర్శించేందుకు తప్పుడు కథనాలు రాసే స్థాయికి జగన్ దిగజారారు” అని లోకేశ్ ఆరోపించారు. విద్యార్థుల మధ్య వ్యక్తిగత గొడవను రాజకీయ రంగంలోకి లాగుతూ దళితులను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నిందితులెవ్వరైనా ఉపేక్షించదని స్పష్టం చేస్తూ, ఇప్పటి వరకు కొందరిని అరెస్ట్ చేశామని, మిగిలినవారి కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు.

జగన్ రాజకీయం చేసే విధానం గతంలో ఎలా ఉండిందో ప్రజలకు తెలుసునని, ఇప్పుడు కూడా అదే తీరు కొనసాగుతున్నదని లోకేశ్ విమర్శించారు. సుదాకర్, సుబ్రహ్మణ్యం వంటి దళితులపై జగన్ ప్రభుత్వం కాలంలో జరిగిన దాడులను గుర్తు చేస్తూ, జగన్ పాలన దళితులకు హానికరమని హెచ్చరించారు. తిరుపతి ఘటనను దళిత సమాజం సీరియస్‌గా తీసుకోవాలని, తమతో మోసమవకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share