హైదరాబాద్‌కు 2,000 ఈ-బస్సులు – కేంద్రం శుభవార్త

Hyderabad gets 2,000 electric buses under PM e-Drive, aiming to boost public transport and reduce pollution in the city.

హైదరాబాద్ నగర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద శుభవార్తను అందించింది. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద పర్యావరణ హిత ప్రజారవాణాను ప్రోత్సహించేందుకు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నగరానికి 2,000 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. ఈ బస్సులు రాకతో హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారనుంది. ఇందులో భాగంగా నగర కాలుష్యాన్ని తగ్గించడంలో ఇది కీలకపాత్ర పోషించనుంది.

ఈ నిర్ణయం గురువారం కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్.డి. కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో తీసుకున్నారు. తెలంగాణతో పాటు కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలపై ప్రధాన దృష్టి పెట్టిన ఈ సమావేశంలో హైదరాబాద్‌కు 2,000, బెంగళూరుకు 4,500, ఢిల్లీకి 2,800, అహ్మదాబాద్‌కు 1,000, సూరత్‌కు 600 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించారు. అధికారిక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

ఈ సందర్భంగా మంత్రి కుమారస్వామి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం శుద్ధమైన, సుస్థిర పట్టణ రవాణా వైపు మోహిస్తున్నదని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సులతోపాటు ఈ-ఆంబులెన్స్‌లు, ఈ-ట్రక్కుల కోసం కూడా కేంద్రం రూ.500 కోట్ల చొప్పున నిధులను కేటాయించింది. బస్సుల పంపిణీ, సంస్థాగత సంసిద్ధత, రాష్ట్రాలతో సమన్వయంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు.

పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2026 వరకు రూ.10,900 కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా మొత్తం 14,028 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్సుల ప్రాజెక్టులలో ఒకటిగా గుర్తింపు పొందనుంది. ఈవీ కొనుగోలుదారుల కోసం ఈ-వోచర్లు ప్రవేశపెట్టిన కేంద్రం, దేశ వ్యాప్తంగా పర్యావరణ స్పృహతో కూడిన రవాణా వ్యవస్థను నిర్మించేందుకు కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share