చిత్ర పరిశ్రమ తీరు పట్ల పవన్ కల్యాణ్ అసంతృప్తి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, తెలుగు సినీ పరిశ్రమ పెద్దల ఉదాసీనతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినప్పటికీ, సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు ప్రముఖులు ముందుకు రాకపోవడాన్ని ఆయన ఎత్తిచూపారు. గత ప్రభుత్వం నటులు, నిర్మాతలను ఎలా ఇబ్బందులకు గురిచేసిందో మర్చిపోయారా? అని ప్రశ్నించారు. పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తే స్పందన లేదని అన్నారు.
‘రిటర్న్ గిఫ్ట్’పై ఘాటుగా స్పందన
తమ ప్రభుత్వం వ్యక్తులకోసం కాకుండా పరిశ్రమ అభివృద్ధికోసం పని చేస్తోందని స్పష్టం చేస్తూ, సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ‘రిటర్న్ గిఫ్ట్’ను తగిన రీతిలో స్వీకరిస్తానన్నారు. ప్రముఖ నిర్మాతలు టికెట్ ధరల పెంపు కోసం వ్యక్తిగతంగా విజ్ఞప్తులు చేస్తున్నారని, ఇకపై అలాంటి వ్యక్తిగత చర్చలు కుదరవని, సంబంధిత శాఖల ద్వారానే చర్చలు జరుపుతానని తెలిపారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పందన ఇస్తూ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడుతోందని వివరించారు.
గత ప్రభుత్వం తీరును మరిచారా?
అగ్రనటులు, సాంకేతిక నిపుణులు గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న అవమానాలను మర్చిపోవడం బాధాకరమని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చిత్ర పరిశ్రమను సంఘటితంగా ముందుకు తీసుకెళ్లాలని తమ ప్రభుత్వం ఎన్నిసార్లు పిలుపునిచ్చినా, సమాధానమివ్వలేదని విమర్శించారు. తమకు నచ్చిన వారిపట్లే మద్దతుగా వ్యవహరించిన గత ప్రభుత్వ తీరును గుర్తుచేశారు.
థియేటర్ల పరిస్థితులపై సమీక్ష
సినిమా హాళ్ల నిర్వహణ, అందుబాటు, టికెట్ ధరలు, తినుబండారాల ధరలు వంటి అంశాలపై పవన్ కల్యాణ్ సంబంధిత శాఖలతో సమీక్ష జరిపారు. రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లోని మల్టీప్లెక్స్‌ల పరిస్థితిపై దృష్టి పెట్టారు. పరిశ్రమకు అవసరమైన ఆధునిక సాంకేతికత, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్న దిశగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.









