ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స అనంతరం ఇద్దరు ఇంజనీర్లు మృతి చెందడంపై తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనలో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ అనుష్క తివారీ సోమవారం స్థానిక కోర్టులో లొంగిపోయారు. అనంతరం పోలీసులు ఆమెను జైలుకు తరలించారు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా వైద్య విధానాలపై అనుమానాలు, ఆందోళనలు నెలకొనేవిధంగా మారింది.
మృతుల్లో ఒకరైన వినిత్ కుమార్ దూబే భార్య జయా త్రిపాఠి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, మార్చి 13న హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స చేయించుకున్న తన భర్త రెండు రోజుల్లోనే ఆరోగ్యం విషమించి మార్చి 15న మరణించారని పేర్కొన్నారు. తొలుత పోలీసులు స్పందించకపోవడం వల్లే ఫిర్యాదు ఆలస్యమైందని ఆమె వేదన వ్యక్తం చేశారు. సీఎం గ్రీవెన్స్ సెల్‌కు ఫిర్యాదు చేసిన తర్వాతే పోలీసులు చర్యలు ప్రారంభించారని ఆమె తెలిపారు.
జయా త్రిపాఠి కథనం ప్రకారం, మార్చి 14న భర్త ముఖం వాచిపోయిందని తెలిసిన వెంటనే డాక్టర్ అనుష్కను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రాత్రి 11 గంటల సమయంలో ఆమెతో మాట్లాడగలిగారు. ఆ సమయంలో అనుష్క తివారీ ఎలాంటి ముందస్తు ఆరోగ్య పరీక్షలు లేకుండా సర్జరీ చేసిన విషయాన్ని అంగీకరించారనీ ఆరోపించారు. భర్త ఆరోగ్యం మరింత క్షీణించడంతో వేరొక ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందాడని తెలిపారు.
ప్రభుత్వ న్యాయవాది దిలీప్ సింగ్ ప్రకారం, అనుష్క తివారీ డెంటిస్ట్ అయినా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ లాంటి సర్జరీ చేయడం చట్టరీత్యా తప్పు. ఆమెపై తగిన ఆధారాలున్నాయని, విచారణలో అనేక వైద్య నియమాలు ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోందని చెప్పారు. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. పోలీసులు ఈ కేసుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలను సేకరిస్తూ, ఇతర బాధితుల సమాచారాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఘటన ప్రజల్లోనూ, వైద్య వృత్తుల్లోనూ తీవ్ర కలకలం రేపింది.









