తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సమస్యలపై స్పందించే పార్టీగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కడపలో మంగళవారం ప్రారంభమైన మహానాడు వేదికపై ఆయన ప్రసంగిస్తూ, 43 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ప్రస్తుతం 44వ ఏట అడుగుపెడుతుందనీ, పార్టీ కార్యకర్తల త్యాగాలే ఎన్డీయే ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ పార్టీ కార్యకర్తలకు ఎప్పటికీ రుణపడి ఉంటారని ఆయన అన్నారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలన వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని, రైతులకు గిట్టుబాటు ధరల లభ్యత లేకపోవడం, పంటల కొనుగోలు ఆలస్యం, వ్యవసాయానికి అవసరమైన పరికరాలు, ఎరువులు, విత్తనాలు లేకపోవడం వంటి సమస్యలు తీవ్రంగా ప్రభావం చూపినట్టు మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే రైతుల బాకీలను చెల్లించడమే కాకుండా, ప్రతి గింజను కొనుగోలు చేసి 24 గంటల్లోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేసిందని వివరించారు. ఇది చంద్రబాబు రైతుల పట్ల చూపుతున్న గౌరవానికి నిదర్శనమని అన్నారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే దిశగా ప్రభుత్వం గణనీయమైన చర్యలు తీసుకుంటోందని మంత్రి అన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే విధంగా సాగు విధానాలు ప్రవేశపెట్టారని, 24 పంటలను 11 క్లస్టర్లుగా విభజించి, రాయలసీమలో 9 కీలక పంటలకు ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
రాయలసీమలో తక్కువ నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని, 2014–2019లో డ్రిప్ ఇరిగేషన్‌ను భారీగా ప్రోత్సహించామని, అయితే గత ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక డ్రిప్ వ్యవస్థను పునరుద్ధరించామని, ప్రస్తుతం దేశంలోనే రాయలసీమ ఈ రంగంలో మొదటి స్థానంలో ఉందని గర్వంగా చెప్పారు. వ్యవసాయ యంత్రాలు, డ్రోన్ల వినియోగం, మిర్చి, పొగాకు, మామిడి రైతుల్ని సహాయపడటంతో సహా వ్యవసాయ రంగాన్ని పునరుజ్జీవింప చేయడంలో చంద్రబాబు తీసుకుంటున్న చర్యలను కొనియాడారు.









