హైదరాబాద్ నగరంలో మిస్ వరల్డ్ 2025 ఫైనల్ పోటీలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని హైటెక్స్ వేదిక ఈ అంతర్జాతీయ అందాల పోటీలకు ఆతిథ్యమిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాలీవుడ్ తారల ఆకట్టుకునే ప్రదర్శనలు, సంగీతం, డాన్స్ షోలు ఈ కార్యక్రమానికి మరింత శోభను కలిగించాయి. ప్రపంచవ్యాప్తంగా 108 దేశాలకు చెందిన సౌందర్య రాశులు మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీ పడుతుండగా, వేడుక అంతటా అట్టహాసంగా సాగింది.
ఈ పోటీల్లో ఇప్పటికే పలు రౌండ్లు ముగిశాయి. అందులో తమ ప్రతిభను చాటిన 16 మంది అందగత్తెలు క్వార్టర్స్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. వారు చూపిన టాలెంట్, ఇంటెలిజెన్స్, సోషల్ కాజ్‌పై ఉన్న అభిప్రాయాలు న్యాయనిర్ణేతల మన్ననలు పొందాయి. ఇక ఇప్పుడు ఖండాల ప్రాతినిధ్యంతో నలుగురిని ఎంపిక చేసి, ఫైనల్ రౌండ్‌కు తీసుకెళ్లనున్నారు. ఒక్కొక్క ఖండం నుంచి ఒకరిని ఎంపిక చేయనున్న ఈ రౌండ్ మిస్ వరల్డ్ విజేతను నిర్ణయించనుంది.
ఫైనల్ రౌండ్లో ఈ నలుగురు ఫైనలిస్టులకు ఒకే ప్రశ్న అడుగుతారు. దానికి వారు ఇచ్చే సమాధానమే చివరికి విజేతను నిర్ణయించనుంది. ఇది కేవలం అందం పోటీ మాత్రమే కాకుండా, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, సమాజంపై వారి దృష్టిని చూపే వేదిక కూడా. ఈ విధంగా మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకునే సదృష్టి ఒక అందగత్తెకు దక్కనుంది.
ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా ప్రముఖ నటుడు సోనూ సూద్, వ్యాపారవేత్త సుధారెడ్డి, మిస్ ఇంగ్లండ్ 2014 కెరీనా వ్యవహరిస్తుండగా, మిస్ వరల్డ్ ఛైర్మన్ జూలియా మోర్లీ ప్రధాన న్యాయనిర్ణేతగా ఉన్నారు. సినీ పరిశ్రమ నుంచి దగ్గుబాటి రానా, నటి నమ్రత హాజరై వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈ వేడుక, హైదరాబాద్‌కు గ్లోబల్ గుర్తింపునిచ్చే ఘట్టంగా నిలిచింది.









