ప్రముఖ క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ మాజీ భార్యగా గుర్తింపు పొందిన డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, నటి ధనశ్రీ వర్మ ఇప్పుడు టాలీవుడ్‌ను టార్గెట్ చేస్తూ వెండితెరపై అడుగుపెడుతున్నారు. ‘ఆకాశం దాటి వస్తావా’ అనే తెలుగు చిత్రంతో తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ‘టింగ్ లింగ్ సజనా’ వంటి మ్యూజిక్ వీడియోల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న ధనశ్రీ, ఇప్పుడు నటనలోనూ తన ప్రతిభను పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఇటీవల ఒక ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధనశ్రీ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వదంతులపై స్పందించారు. “నా జీవితం గురించి ఊహాగానాలు వచ్చిపోతుంటాయి. కానీ వాటి గురించి నేను తల పట్టించుకోను. నా నైతిక విలువలు, నేను ఎదిగిన తీరు నాకు తెలుసు. గౌరవంగా ఉండటం నా లక్ష్యం. బాహ్య అంచనాలు నాకు సంబంధించవు,” అని ధనశ్రీ స్పష్టం చేశారు.
ప్రస్తుతం తన దృష్టి పూర్తిగా కెరీర్‌పై ఉందని ఆమె తెలిపారు. షూటింగ్‌లు, పాటల ప్లానింగ్, సృజనాత్మక పనులతో బిజీగా ఉన్న ఆమె, “ఈ మార్పులు నన్ను కొత్తదనంగా మార్చాయి. డ్యాన్స్, మ్యూజిక్, నటన నాకు ఓ పునాదిగా నిలిచాయి. పని చేయడంలోనే నాకు ఆనందం, ఆత్మసంతృప్తి లభిస్తోంది” అంటూ పేర్కొన్నారు. ఆమెకు టాలీవుడ్ నుంచి మంచి అవకాశాలు వస్తున్నాయని, దానికోసం తాను ఎంతో సిద్ధమై ఉన్నానని తెలిపారు.
ప్రేమ, వివాహం వంటి విషయాలపై మాట్లాడుతూ, “ప్రేమ అనేది మనం ప్లాన్ చేసుకునేది కాదు. అది సహజంగా జరుగుతుంది. అయితే ప్రస్తుతం నా ప్రాధాన్యం నా పని మీదే. పెద్ద ప్రాజెక్టులు చేయాలనేది నా లక్ష్యం. మంచి సమయంలో మంచి జ్ఞాపకాలు సృష్టించాలనేది నా ఆశ” అని ధనశ్రీ చెప్పారు. బాలీవుడ్‌తో పాటు ఇప్పుడు టాలీవుడ్‌లోనూ తన మార్కు వేయాలని ధనశ్రీ ఆశిస్తున్నారు. ప్రేక్షకులు ఆమె నటనకు ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.









