గాలి శిక్ష సస్పెన్షన్ కోరుతూ హైకోర్టు దరఖాస్తు

Gali Janardhan Reddy moves HC seeking suspension of sentence in OMC case to retain MLA post ahead of upcoming elections.

ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) అక్రమాల కేసులో సీబీఐ కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను సస్పెండ్ చేయాలని కోరుతూ గాలి జనార్దన్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. శిక్షతో తన శాసనసభ్యత్వం రద్దయిన నేపథ్యంలో, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ పిటిషన్‌పై హైకోర్టు తక్షణమే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో ఆయనతో పాటు ఇతర నిందితులు కూడా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. నిందితుల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు సీబీఐ కోర్టు విధించిన శిక్ష ఏడేళ్ల కంటే ఎక్కువ కాదని, అలాంటి కేసుల్లో సాధారణంగా బెయిల్ మంజూరు చేయడం ఆనవాయితీనని పేర్కొన్నారు. గాలి ఇప్పటికే మూడున్నరేళ్ల శిక్ష అనుభవించారని, తదుపరి హైకోర్టు తీర్పు వరకు జైలు శిక్షను సస్పెండ్ చేయాలని కోరారు.

సీబీఐ తరఫున న్యాయవాది కాపాటి శ్రీనివాస్ తమకు శిక్ష సస్పెన్షన్‌పై వాదనలు వినిపించేందుకు సమయం అవసరమని పేర్కొన్నారు. అయితే, గాలి తరఫున న్యాయవాది నాగముత్తు మాత్రం మిగిలిన నిందితులు శాసనసభ్యులు కాదని, గాలి మాత్రం ఎమ్మెల్యేగా ఉన్నందున ఈ విషయంలో త్వరిత నిర్ణయం అవసరమని న్యాయస్థానాన్ని కోరారు. శిక్ష కారణంగా ఇప్పటికే ఆయన పదవి రద్దైన నేపథ్యంలో, ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు తక్షణ ఉత్తర్వులు అవసరమని తెలిపారు.

ఇరుపక్షాల వాదనలు వినిన ధర్మాసనం, బెయిల్ పిటిషన్లపై తీర్పును రిజర్వ్ చేస్తూ, గాలి జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన జైలు శిక్ష సస్పెన్షన్ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపడతామని ప్రకటించింది. ఈ వ్యవహారంలో శ్రీలక్ష్మి కేసు వివరాలు కూడా ప్రస్తావనకు రావగా, హైకోర్టు తన ముందు విచారించిన క్వాష్ పిటిషన్‌ను తానే కొట్టేశానని, ప్రస్తుతం ఉన్న పిటిషన్‌పై విచారణకు సిద్ధమని జస్టిస్ లక్ష్మణ్ వెల్లడించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share