అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన విషాదకర సంఘటన నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన ప్రెస్ మీట్‌ను వాయిదా వేశారు. ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ (ISRL) ప్రచారకర్తగా గురువారం ముంబైలో జరగాల్సిన కార్యక్రమంలో ఆయన హాజరయ్యే ఏర్పాట్లు ఉండగా, అదే సమయంలో విమాన ప్రమాద వార్త వెలుగులోకి వచ్చింది. దాంతో ఈవెంట్‌ను నిలిపివేయాలని నిర్వాహకులు నిర్ణయించారు.
ఈ విషాద ఘటనపై స్పందించిన ISRL నిర్వహకులు, దేశమంతా దుఃఖంలో ఉన్న తరుణంలో కార్యక్రమాన్ని కొనసాగించడం అనుచితమని పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్‌తో కలిసి వారూ బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. “ఈ రోజు మన దేశం దుఃఖంలో ఉంది. ఇది సంబరాల సమయం కాదు. అందుకే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించాం,” అని వారు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ క్లిష్ట సమయంలో దేశంతో ఐక్యంగా నిలబడే సంకల్పంతో, ISRL యాజమాన్యం మరియు సల్మాన్ ఖాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. “ఈ సమయంలో మేము బాధిత కుటుంబాల పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సరైన సమయాన్ని ఎంపిక చేస్తాం,” అని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఇటు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ ఘటనపై స్పందించారు. అక్షయ్ కుమార్, కార్తీక్ ఆర్యన్, అలియా భట్, కరీనా కపూర్, జాన్వీ కపూర్, వరుణ్ ధావన్, శిల్పా శెట్టి, విక్కీ కౌశల్ వంటి ప్రముఖులు సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని తెలిపారు. ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది.









