బ్రిటన్‌లో ఆరోగ్య అధికారులు మల్టిపుల్ మైలోమా వంటి తీవ్రమైన రక్త క్యాన్సర్ రోగుల కోసం ఒక వినూత్న లక్షిత చికిత్సను ప్రవేశపెట్టారు. ఈ థెరపీని ‘ట్రోజన్ హార్స్’గా పిలుస్తున్నారు, ఎందుకంటే ఇది క్యాన్సర్ కణాల్లోకి ప్రవేశించి వాటిని లోపల నుంచే నాశనం చేస్తుంది. బెలంటామాబ్ మఫోడోటిన్ అనే ఈ ఔషధాన్ని యూకే జాతీయ ఆరోగ్య సేవ (ఎన్హెచ్ఎస్) ప్రపంచంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెస్తోంది. ఇది ప్రతి ఏడాది దాదాపు 1,500 మందికి అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది.
ఈ ఔషధానికి నైస్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ ఎక్సలెన్స్) సంస్థ ఆమోదం తెలిపింది. ఇతర చికిత్సలు ఫలించని స్థితిలో ఉన్న రోగులకు ఇది ఒక ముఖ్యమైన అవకాశంగా మారుతుంది. బెలంటామాబ్ మఫోడోటిన్ను బోర్టెజోమిబ్ మరియు డెక్సామెథాసోన్లతో కలిపి ఇస్తే, ఇది మూడు సంవత్సరాల వరకు క్యాన్సర్ వ్యాప్తిని అడ్డుకుంటుందని అధ్యయనాల్లో నిరూపితమైంది. ఇతర సంప్రదాయ చికిత్సలతో పోలిస్తే ఇది ఎక్కువ కాలం క్యాన్సర్‌ను నియంత్రణలో ఉంచగలదు.
ఈ ఔషధం ట్రోజన్ హార్స్ తరహాలో పనిచేస్తుంది. ఇది క్యాన్సర్ కణాల ఉపరితలంపై ఉండే నిర్దిష్ట ప్రొటీన్‌ను గుర్తించి వాటిని లక్ష్యంగా చేసుకుంటుంది. అలా కణంలోకి ప్రవేశించిన తర్వాత, ప్రమాదకరమైన విష పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఇది చుట్టుపక్కల ఆరోగ్య కణజాలాన్ని దెబ్బతీయకుండా, కేవలం క్యాన్సర్ కణాలపైనే దాడి చేస్తుంది. ప్రతి మూడు వారాలకు ఒకసారి ఇన్ఫ్యూజన్ రూపంలో దీన్ని ఇస్తారు.
మల్టిపుల్ మైలోమాతో బాధపడుతున్న రోగులకు ఇది నిజంగా ఆశాజనక పరిణామం. షెఫీల్డ్‌కు చెందిన 60 ఏళ్ల పాల్ సిల్వెస్టర్ ఈ ఔషధాన్ని తీసుకున్న మొదటి వారాల్లోనే మంచి ఫలితాలు చూశారు. “ఈ చికిత్స మళ్లీ జీవితం మీద ఆశ కలిగించింది,” అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. దీన్ని మొదటి దశ చికిత్సలు విఫలమైన తర్వాత అందించనుండటం వల్ల, దీన్ని తుదిపాయిగా పరిగణించే వారు చాలామందే. కానీ, దీనివల్ల ఎంతో మందికి సుదీర్ఘకాలిక జీవితం సాధ్యం కావొచ్చని వైద్య నిపుణులు నమ్ముతున్నారు.









