ఇండోర్‌కు చెందిన వ్యాపారి రాజా రఘువంశీ మేఘాలయలో హనీమూన్ సందర్భంగా హత్యకు గురైన కేసుపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసును ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారిస్తున్నది. అయితే మృతుడి సోదరుడు కేసుపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తూ, నిందితుల వెనుక మరింత గాఢమైన కుట్ర ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. రాజా భార్య సోనమ్ కుటుంబ సభ్యులపై నార్కో అనాలసిస్ పరీక్షలు జరపాలని అధికారులను డిమాండ్ చేశారు.
“ఇది కేవలం కిరాయి హంతకుల పని మాత్రమే కాదు. సోనమ్ ప్రియుడితోపాటు మరికొందరు కూడా ఇందులో పాల్గొన్నట్టుగా అనిపిస్తోంది. కుట్ర ఏ మాత్రం మిగిలిపోకుండా దర్యాప్తు జరగాలి” అని రాజా సోదరుడు అన్నారు. ఆయన సూచన మేరకు సోనమ్ తల్లిదండ్రులు, బంధువులకు నార్కో పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇంతలోనే ఈ హత్యకు కొన్ని గంటల ముందు తీసిన ఓ వీడియో వైరల్ కావడం సంచలనం సృష్టించింది. మేఘాలయ అడవుల్లో ట్రెక్కింగ్ చేస్తూ రాజా, సోనమ్ కనిపిస్తున్న ఈ వీడియోను దేవేందర్ సింగ్ అనే యూట్యూబర్ విడుదల చేశాడు. ట్రెక్కింగ్ సమయంలో సోనమ్ ముందుగా నడుస్తూ ఉండగా, రాజా వెనుకన వెళుతున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. ఈ వీడియో ఇప్పుడు నూతన కోణాన్ని వెలుగులోకి తెస్తోంది.
ఈ వీడియోపై కూడా రాజా సోదరుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఇది అంతకు ముందే ఉందని తెలిసినప్పుడు పోలీసులకు అప్పగించకుండా సోషల్ మీడియాలో ఎందుకు షేర్ చేశారు?” అని ప్రశ్నించారు. దీని వెనుక ఏమైనా దుశ్చతన ఉందా అన్న కోణంలో పోలీసులు ఈ వీడియోను విడుదల చేసిన వారిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.









