ఏలూరు జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగును విస్తృతంగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. పెదవేగిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, ఈ ఏడాది జిల్లాలో 15 వేల హెక్టార్లలో ఆయిల్ ఫామ్ పంటను విస్తరించాలన్న లక్ష్యంతో ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. పరిశోధన కేంద్ర శాస్త్రవేత్తలు, ఆయిల్ ఫామ్ కంపెనీల ప్రతినిధులు, రైతులతో సమీక్ష నిర్వహించి, పంట దిగుబడి, అంతరపంటల సాగు, యాంత్రీకరణ తదితర అంశాలపై చర్చించారు.
రాష్ట్రంలోనే ఉత్తమమైన పరిశోధన కేంద్రంగా పేరొందిన పెదవేగి ఆయిల్ ఫామ్ కేంద్రం రైతులకు అధిక దిగుబడుల పద్ధతులను అందించడంలో కీలకంగా వ్యవహరిస్తోందని మంత్రి ప్రశంసించారు. 250 ఎకరాల విస్తీర్ణంలో 29 మంది శాస్త్రవేత్తల సహకారంతో జరుగుతున్న టిష్యూకల్చర్, పరిశోధన కార్యక్రమాలు రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయని తెలిపారు. వివిధ ప్రాసెసింగ్ కంపెనీలతో కలిసి రైతులకు శిక్షణా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు జిల్లాస్థాయిలో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఎరువులు, డ్రిప్ ఇరిగేషన్, పురుగుల నివారణపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వకుండా రైతులకు నష్టం కలిగించిందని ఆరోపిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం అన్ని విధాలా రైతులకు సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు.
2027 వరకు కొనసాగే జాతీయ ఆయిల్ మిషన్ ద్వారా కేంద్ర ప్రోత్సాహాలను అందిపుచ్చుకుని, ఆంధ్రప్రదేశ్‌ను ఆయిల్ ఫామ్ సాగులో అగ్రగామిగా తీర్చిదిద్దే దిశగా కృషి జరుగుతోందని తెలిపారు. డెల్టా ప్రాంతాల్లో వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ పంటకు మంచి అవకాశాలు ఉన్నాయని, జీడీపీ వృద్ధిలో ఈ పంట కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. రైతులను ఉద్యానశాఖ, పరిశోధన కేంద్రం సహకారంతో మరింత ప్రోత్సహించేందుకు సమిష్టిగా పని చేస్తామని స్పష్టం చేశారు.









