అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ విషాద సమయంలో ఓ వ్యాపారి రాజేశ్ పటేల్ చూపిన మానవత్వం, ధైర్యం, నిజాయితీ దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. ప్రమాద స్థలానికి వెంటనే చేరి సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్న ఆయన, అనంతరం ప్రయాణికుల విలువైన వస్తువులను భద్రంగా పోలీసులకు అప్పగించడం గొప్ప మనసుకు నిదర్శనంగా నిలిచింది.
రాజేశ్ పటేల్ నివాసం ప్రమాద స్థలానికి కేవలం 300 మీటర్ల దూరంలో ఉంది. కూలిన వెంటనే వచ్చిన భారీ శబ్దంతో అవాక్కయ్యారు. ప్రమాద స్థలానికి చేరుకుని, మంటల మధ్య ప్రాణాలతో ఉన్నవారిని రక్షించేందుకు సాహసంగా ముందుకొచ్చారు. స్ట్రెచర్లు అందుబాటులో లేకపోవడంతో పాత చీరలు, బెడ్షీట్లు, గోనె సంచులతోనే గాయపడినవారిని తరలించారు. అది మానవ సేవకు ఆయన అంకితభావాన్ని చాటిచెప్పింది.
సహాయక చర్యల అనంతరం రాజేశ్ పటేల్ ప్రయాణికుల హ్యాండ్ బ్యాగ్‌లను జాగ్రత్తగా పరిశీలించి, అందులో దొరికిన 70 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు, పాస్‌పోర్టులు, మరియు ఒక భగవద్గీత పుస్తకాన్ని నిష్కళంకంగా పోలీసులకు అప్పగించారు. ఈ నిష్కళుషమైన చర్యకు ప్రతి ఒక్కరూ నీరాజనాలు పలుకుతున్నారు. ఒక సామాన్య వ్యాపారి ఇలా విలువైన వస్తువులను అప్పగించడం నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం.
రాజేశ్ పటేల్‌కు మానవ సేవ కొత్తకాదు. 2008లో అహ్మదాబాద్ బాంబ్ పేలుళ్ల సమయంలో కూడా ఆయన వాలంటీర్‌గా పని చేశారు. ఆ సంఘటనలో తన సన్నిహితులను కోల్పోయిన బాధను అనుభవించిన ఆయన, ప్రతీసారి సహాయానికి ముందుంటారు. ఇప్పుడు జరిగిన విమాన ప్రమాదంలో చూపిన ఉదాత్తత, సహాయ హస్తం, ఆయనను దేశం మొత్తానికి మానవత్వ ప్రతీకగా నిలబెట్టింది.









