దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, అలాగే అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై నిర్ణయం ఈ రాత్రి వెలువడనుండటంతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలను నమోదు చేశాయి. అయినా ఆటో, ఫైనాన్షియల్ రంగాల్లో కొనుగోళ్ల మద్దతు మార్కెట్లను తీవ్ర పతనానికి అడ్డుపడింది.
ట్రేడింగ్ ముగిసే సమయానికి, బీఎస్ఈ సెన్సెక్స్ 138 పాయింట్లు నష్టపోయి 81,444 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 41 పాయింట్లు కోల్పోయి 24,812 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి కానీ మధ్యలో కొంత కోలుకుని చివరకు స్వల్ప నష్టాలతో ముగిశాయి.
సెన్సెక్స్‌లో టీసీఎస్, అదానీ పోర్ట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. మరోవైపు, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్ లాంటి షేర్లు లాభపడుతూ మార్కెట్లను కొంత నిలబెట్టాయి.
అంతర్జాతీయంగా బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ ధర 76 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, బంగారం ఔన్సు ధర 3397 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.48గా ఉంది. ఫెడ్ వడ్డీ రేట్లపై స్పష్టత వచ్చేంత వరకు మార్కెట్లు అస్తిరంగా ఉండే అవకాశముంది.









