టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రతిష్ఠాత్మక టెస్ట్ సిరీస్‌కి లీడ్స్ హెడింగ్లీ మైదానం వేదిక కానుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్ జూన్ 20న ప్రారంభంకానుండగా, ఇప్పటికే భారత జట్టు లీడ్స్ చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించింది. ఇంగ్లండ్ జట్టు కూడా హెడింగ్లీలోనే శిబిరం ఏర్పాటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్ పిచ్ పరిస్థితులు ఎలా ఉంటాయన్నదే హాట్ టాపిక్‌గా మారింది.
లీడ్స్ గ్రౌండ్ హెడ్ రిచర్డ్ రాబిన్సన్ ప్రకారం, ప్రస్తుతం హెడింగ్లీలో చాలా పొడి వాతావరణం నెలకొంది. దీని ప్రభావంతో పిచ్ మంచి సర్ఫేస్‌ను కలిగి ఉండే అవకాశం ఉందని ఆయన తెలిపారు. మొదటి రోజు పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉండవచ్చని, తర్వాతి రోజుల్లో మాత్రం అది బ్యాటింగ్‌కు అనుకూలంగా మారే అవకాశముందని చెప్పారు. ఇలాంటి పిచ్ ఇంగ్లండ్ జట్టు బజ్‌బాల్ ఆట శైలికి అనుకూలంగా ఉండనుంది.
ఈసారి హెడింగ్లీలో సిరీస్ తొలి మ్యాచ్ నిర్వహించడం అనేది కొంత విభిన్నమైన పరిణామం. గతంలో మధ్య టెస్ట్‌లు ఇక్కడే జరిగేవి. దీంతో పాటు, భారత్ ఈ మైదానంలో గడచిన రెండు దశాబ్దాల్లో చాలా తక్కువ టెస్ట్‌లు ఆడింది. ఈ నేపథ్యంలో భారత జట్టు పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో అని అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు శుభ్‌మన్ గిల్‌కి అప్పగించబడిన ఈ సిరీస్ ప్రాధాన్యత ఎక్కువ. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అనంతరం జట్టులో అనుభవం కొరవడి ఉంది. సీనియర్లుగా జడేజా, రాహుల్ కీలకంగా నిలవనుండగా, యశస్వి జైస్వాల్ మొదటి ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు సిద్ధమవుతున్నారు. 2017 తర్వాత తిరిగి వచ్చిన కరుణ్ నాయర్ ప్రదర్శన కూడా కీలకం కానుంది. యువ భారత్ జట్టు బలమైన ఇంగ్లండ్ జట్టుతో ఎలా పోటీపడుతుందో చూడాలి.









