రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవాల సందర్భంగా జూన్ 4న చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోవడంపై సామాజిక కార్యకర్త టీజే అబ్రహం కబన్ పార్క్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ఈ ఘటనకు ప్రధాన బాధ్యుడిగా పేర్కొన్నారు. సీఎం సిద్ధరామయ్య, హోంమంత్రి పరమేశ్వరతో పాటు పలువురు అధికారుల పేర్లను కూడా నిందితుల జాబితాలో చేర్చారు.
ఈ ఘటనను ఉద్దేశపూర్వక హత్యగా పేర్కొన్న అబ్రహం, ఇది ప్రమాదవశాత్తు కాదు, పథకప్రకారంగా సృష్టించిన తొక్కిసలాటగా ఆరోపించారు. “ఇది క్రియాశీల కుట్ర ఫలితమే. ప్రజల ప్రాణాలతో రాజకీయం చేస్తున్నారనడానికి ఇది నిదర్శనం. డీకే శివకుమార్‌కు ఈ తొక్కిసలాట వెనుక కీలక పాత్ర ఉందని నిర్ధారించాం,” అని అబ్రహం మీడియాతో అన్నారు.
వైభవంగా నిర్వహించాల్సిన విజయోత్సవ ర్యాలీని డీకే శివకుమార్ ఒత్తిడి వల్ల చిన్నస్వామి స్టేడియానికి తరలించారని ఆరోపించారు. ఆర్‌సీబీ జట్టును కొనుగోలు చేసేందుకు ఆయన ప్రయత్నించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, “ఆయన పోస్టర్లపై ఆర్‌సీబీ లోగో ఎందుకు ఉండాలి? అధికారిక అనుమతులేమీ లేకుండానే ఈ వేడుకలు ఎలా జరిగాయి?” అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమానికి ఫైర్, పోలీస్, పీడబ్ల్యూడీ నుంచి అనుమతులు లేకుండా నిర్వహించారని విమర్శించారు.
ఈ ఘటనపై న్యాయపోరాటం కొనసాగిస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు వెనక్కి తగ్గబోమని అబ్రహం స్పష్టం చేశారు. “ఇది సామాన్య ప్రజల జీవితం గాలికొదిలేసిన ఉదాహరణ. పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగింది,” అంటూ తాను ఫిర్యాదులో పేర్కొన్న వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వంపై న్యాయస్థానాల్లో న్యాయపోరాటం ద్వారా న్యాయం సాధించడానికి కృషి చేస్తామని చెప్పారు.









