ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడ నివసిస్తున్న భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఇరాన్‌లోని కోమ్ నగరంలో నివసిస్తున్న కుటుంబాల పరిస్థితి మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కాసీం రజా అనే వ్యక్తి తన కుమార్తె ఎమాన్, ఆమె భర్త, ఇద్దరు పిల్లల భద్రత గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “వారు ప్రస్తుతం చాలా భయభ్రాంతుల్లో ఉన్నారు. ఒక్కటే మనసులో — ఎలాగైనా భారతదేశానికి చేరుకోవాలి,” అని ఆయన అన్నారు.
కాసీం రజా పీటీఐకి ఇచ్చిన వివరాల ప్రకారం, బుధవారం తాను చివరిసారిగా తన కుమార్తెతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. ఆ తర్వాత ఆమెను సంప్రదించే ప్రయత్నాలు విఫలమయ్యాయని, ఫోన్లు అన్రీస్పాన్సివ్గా ఉన్నాయని చెప్పారు. ఎమాన్‌కు థైరాయిడ్ సమస్య కూడా ఉండటంతో, ఆమె ఆరోగ్యం పై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా స్పందించి తన కుమార్తె కుటుంబాన్ని సురక్షితంగా తీసుకురావాలని రజా విజ్ఞప్తి చేశారు.
ఎమాన్‌కు 2017లో మధ్యప్రదేశ్‌కు చెందిన ఎజాజ్ జైదీతో వివాహమైంది. 2018లో ఈ దంపతులు ఇద్దరూ ఉద్యోగ రీత్యా ఇరాన్‌కు వెళ్లారు. అప్పటి నుంచి అక్కడే నివసిస్తున్నారు. అయితే ఇటీవల ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్లో పరిస్థితి మరింత వేడెక్కిపోవడంతో వారు భయభ్రాంతులకు లోనయ్యారు. బుధవారం జరిగిన సంభాషణలో తన కుమార్తె కన్నీటి పర్యంతమై తనను భారత్‌కి తీసుకురావాలని వేడుకున్నారని రజా అన్నారు.
ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ‘ఆపరేషన్ సింధు’ పేరుతో ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు ప్రారంభించింది. పలువురు భారతీయులను ఈ ఆపరేషన్ ద్వారా ఇప్పటికే రప్పించారు. ఇదే తరహాలో ఇజ్రాయెల్‌లో ఉన్నవారిని కూడా రప్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. కాసీం రజా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు వెల్లడించడంతో, అతని కుటుంబం కూడా త్వరలో స్వదేశానికి రాక్కొనగలదనే ఆశాభావం వ్యక్తమవుతోంది.









