జమ్ము కశ్మీర్‌కు చెందే అదనపు జలాలను ఇతర రాష్ట్రాలకు, ముఖ్యంగా పంజాబ్‌కు తరలించాలన్న కేంద్ర ప్రతిపాదనపై రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. జమ్ములో 113 కిలోమీటర్ల కాలువ ద్వారా నీటిని తరలించాలన్న యోజనపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “మా అవసరాలు పూర్తి అయిన తరువాతే మిగతా వాటిని పంచే అంశం గురించి ఆలోచిస్తాం” అని స్పష్టం చేశారు.
“జమ్ములో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్ర నీటి ఎద్దడి వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాంటప్పుడు మా రాష్ట్ర నీటిని ఇతరులకు ఎందుకు ఇవ్వాలి?” అని ప్రశ్నించిన ఆయన, గతంలో తమకు అవసరమైన సమయంలో పంజాబ్ సహకరించలేదని గుర్తు చేశారు. సింధూ జలాల ఒప్పందం ప్రకారం పంజాబ్‌కు తగినంత నీటిని ఇప్పటికే అందిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు.
రావి నది జలాల తరలింపు విషయంలో గతంలో పఠాన్‌కోట్ వద్ద బ్యారేజీ నిర్మాణంపై పంజాబ్‌తో వివాదం సాగిందని, చివరకు కేంద్ర జోక్యంతో 2018లో ఒక పరిష్కారం వచ్చినా, ఆ అవస్థలు తలచుకుంటే ఇప్పటికీ మనసు కలవరపడుతుందని ఆయన అన్నారు. గత అనుభవాల నేపథ్యంలో, ఇప్పుడు పంజాబ్‌కు నీటిని ఇవ్వడం సరైనది కాదని వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పాకిస్థాన్‌కు వెళ్తున్న సింధూ జలాల మిగులు భాగాన్ని పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లకు మళ్లించేందుకు ప్రయత్నాలు చేపడుతుండగా, ఒమర్ అబ్దుల్లా చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, స్థానిక అవసరాలే మొదటని, మిగులు జలాల అంశాన్ని ఆ తరువాతే పరిశీలిస్తామని ఆయన స్పష్టం చేశారు.









