బ్రిటన్‌కు చెందిన రాయల్ నేవీ అత్యాధునిక యుద్ధవిమానం ఎఫ్-35బి లైట్నింగ్ II, జూన్ 14న కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసింది. అయితే, విమానంలో తలెత్తిన హైడ్రాలిక్ సమస్య ఇంకా పరిష్కారంకాలేదని అధికారులు తెలిపారు. దాంతో ఇది ఆరుగురోజులుగా అదే విమానాశ్రయంలో నిలిచిపోయింది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మరియు గోప్యత కలిగిన టెక్నాలజీతో రూపొందించిన ఈ స్టెల్త్ యుద్ధవిమానం గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు రాయల్ నేవీకి చెందిన ఇంజినీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ, సమస్య ఇంకా పూర్తిగా తీరలేదు. meantime, ఎయిరిండియా తన హ్యాంగర్ వసతిని ఉపయోగించుకోవాలని ఆఫర్ ఇచ్చినప్పటికీ, బ్రిటిష్ నేవీ దాన్ని తిరస్కరించింది. ఈ నిర్ణయానికి ముఖ్యకారణం రహస్య సాంకేతిక వివరాల పరిరక్షణే కావచ్చని రక్షణ నిపుణులు పేర్కొంటున్నారు. విమానం గురించి ఇతరులకు కనీస సమాచారం కూడా లీక్ కాకూడదన్న ఆందోళన నేపథ్యంలోనే ఈ నిరాకరణ తీసుకున్నట్లు విశ్లేషిస్తున్నారు.
ఈ ఎఫ్-35బి, యూకేకు చెందిన హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లో భాగంగా, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మోహరించబడింది. భారత నౌకాదళంతో ఇటీవల సంయుక్త విన్యాసాల్లో పాల్గొన్న ఈ గ్రూప్ నుంచి ఈ యుద్ధవిమానం గగనతలంలోకి వెళ్లింది. ఇంధనం తక్కువగా ఉండడంతో, పైలట్ తిరువనంతపురం విమానాశ్రయాన్ని సంప్రదించి అత్యవసర ల్యాండింగ్‌ను విజయవంతంగా నిర్వహించాడు. ఈ విషయాన్ని తర్వాత భారత వైమానిక దళం ధృవీకరించింది.
ఈ విమానం ల్యాండింగ్ అయినప్పటి నుండి విమానాశ్రయంలో భద్రతా చర్యలు మరింత కఠినంగా అమలవుతున్నాయి. పైలట్‌తో పాటు రాయల్ నేవీకి చెందిన సాంకేతిక బృందం అక్కడే ఉండి మరమ్మతుల్లో నిమగ్నమై ఉంది. చివరి దశల్లో హ్యాంగర్ అవసరం పడే అవకాశాన్ని కొట్టిపారేయలేమని, అత్యంత అప్రమత్తతతో వ్యవహరిస్తున్నట్లు సమాచారం. విమానం చుట్టూ జాగ్రత్తగా ఏర్పాటు చేసిన భద్రతా వలయం స్థానికుల, విమానయాన నిపుణుల దృష్టిని ఆకర్షిస్తోంది.









