బ్రిటన్‌లో ఇజ్రాయెల్ వ్యతిరేకంగా చెలరేగిన నిరసనలు కొత్త మలుపు తిరిగాయి. ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లోని కీలకమైన బ్రిజ్ నార్టన్ రాయల్ ఎయిర్‌ఫోర్స్ (RAF) స్థావరంలోకి పాలస్తీనా అనుకూల కార్యకర్తలు చొరబడిన ఘటన కలకలం రేపుతోంది. RAFకు చెందిన రెండు సైనిక విమానాల ఇంజిన్లలోకి ఎరుపు రంగు పెయింట్‌ను పోసి వాటిని అర్థం పర్చలేనంతగా ధ్వంసం చేశారు.
ఈ దాడికి పాలస్తీనా యాక్షన్ గ్రూప్ అనే సంస్థ బాధ్యత వహించినట్లు ప్రకటించింది. గాజాలో ఇజ్రాయెల్ చేపడుతున్న దాడులను బ్రిటన్ ప్రభుత్వం పరోక్షంగా ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలతో తమ కార్యకర్తలు RAF బేస్‌ను లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొంది. RAF స్థావరంలో వున్న విమానాలు గాజాలో నిఘా కార్యకలాపాల్లో ఉపయోగించబడుతున్నాయనీ, బ్రిటన్ ఇజ్రాయెల్ యుద్ధ విమానాలకు ఇంధనం, సమాచార సహాయం అందిస్తోందనీ ఆ గ్రూప్ ఆరోపించింది.
సామాజిక మాధ్యమాల్లో తమ దాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను పోస్టు చేసిన పాలస్తీనా యాక్షన్ గ్రూప్, “ఇది బ్రిటన్ ప్రభుత్వం మోసపూరిత వైఖరిపై ఒక గట్టి హెచ్చరిక” అని స్పష్టం చేసింది. వారు తమ చర్యలను న్యాయసమ్మతంగా, అవసరమైన నిరసనగా సమర్థించుకుంటున్నారు. RAF స్థావరం వంటి అతి కీలక భద్రతా ప్రాంతంలో ఈ విధమైన చొరబాటు దేశ భద్రతకు సంబంధించిన అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
ఇదిలా ఉండగా, బ్రిటన్ పోలీసులు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. RAF స్థావరం అనేది అత్యంత సురక్షిత ప్రాంతం కావడంతో, ఇంత కఠిన భద్రతను దాటి నిందితులు లోపలికి ఎలా చొరబడగలిగారు అనే దానిపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు సమాచారం. RAF వర్గాలు తమ సైనిక వసతులపై జరిగిన ఈ దాడిని ‘జాతీయ భద్రతకు సవాల్’గా పరిగణిస్తున్నాయి.









