ఢిల్లీ నుంచి జమ్ము మీదుగా శ్రీనగర్‌కు బయలుదేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం జమ్ములో ల్యాండ్ కాకుండానే తిరిగి ఢిల్లీకి చేరుకోవడం ప్రయాణికుల్లో గందరగోళాన్ని కలిగించింది. ఐఎక్స్-2564 నెంబర్‌తో ఉన్న ఈ విమానం సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరి షెడ్యూల్ ప్రకారం జమ్ములో ఆగి తర్వాత శ్రీనగర్ వెళ్లాల్సి ఉంది. అయితే జమ్ము విమానాశ్రయం దగ్గరికి వచ్చిన తర్వాత పైలట్ ల్యాండ్ చేయకుండా కొంత సేపు గాల్లో చక్కర్లు కొట్టి, తిరిగి ఢిల్లీకి వెనక్కి మళ్లించారు.
ఈ ఘటనపై ఎయిరిండియా అధికారులు స్పందిస్తూ, ఇది పూర్తిగా ముందు జాగ్రత్త చర్య అని తెలిపారు. జీపీఎస్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా పైలట్ విమానాన్ని భద్రతా పరంగా ల్యాండ్ చేయకుండా, డిల్లీకి మళ్లించాడని వెల్లడించారు. ప్రయాణికుల సురక్షతే ప్రథమ ప్రాధాన్యతగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని ఎయిరిండియా ప్రకటించింది.
విమానాన్ని మళ్లించిన తర్వాత ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఎయిరిండియా తెలిపింది. “ప్రయాణికుల గమ్యస్థానాలకు చేరేందుకు మరో విమానాన్ని ఏర్పాటు చేశాం. ఈ లోపం వల్ల ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం” అని ఎయిరిండియా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రయాణికులందరూ సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారని కంపెనీ స్పష్టం చేసింది.
ఇంకా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో జీపీఎస్ సిగ్నల్ లోపాలు రావడం సాధారణమని, అటువంటి ప్రాంతాల్లో ల్యాండింగ్‌కి అదనపు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమవుతుందని అధికారులు గుర్తుచేశారు. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ, సాంకేతిక కారణాలతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. విమాన ప్రయాణ భద్రతను నిర్లక్ష్యం చేయకుండా తీసుకున్న చర్యలకు ప్రయాణికుల మద్దతు లభించినట్లు తెలుస్తోంది.









