అహ్మదాబాద్ నగరంలోని పలు ప్రముఖ సంస్థలకు బాంబు బెదిరింపు ఈమెయిళ్లు పంపిన కేసులో చెన్నైకి చెందిన మహిళా టెక్కీ రెనీ జోషిల్డాను పోలీసులు అరెస్ట్ చేశారు. డెలాయిట్ యూఎస్‌ఐలో సీనియర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న ఈ రోబోటిక్స్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ గతంలో జరిగిన ఓ విమాన ప్రమాదానికి తానే బాధ్యురాలినని చెప్పేంతవరకు అతి తీవ్రంగా మానసిక స్థితిని కోల్పోయినట్టు అధికారులు భావిస్తున్నారు.
రెనీ మొత్తం 21 బెదిరింపు ఈమెయిళ్లు పంపినట్లు గుర్తించారు. ఇందులో 13 నరేంద్ర మోదీ స్టేడియానికి, 4 జెనీవా లిబరల్ స్కూల్‌కు, 3 భోపాల్ దివ్యజ్యోత్ స్కూల్‌కు, 1 బీజే మెడికల్ కాలేజీకి పంపినట్లు పోలీసులు నిర్ధారించారు. 2024 జూన్ 12న మెడికల్ కాలేజీకి పంపిన ఈమెయిల్‌లో, 270 మంది మరణించిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి తానే బాధ్యురాలినని పేర్కొనడం అధికారులకు ఆందోళన కలిగించింది.
ఈ కేసును విచారించిన అహ్మదాబాద్ సిటీ క్రైం బ్రాంచ్ అధికారులు, రెనీకి సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. తాను ప్రేమించిన వ్యక్తి వేరొకరిని పెళ్లి చేసుకోవడంతో తలెత్తిన బాధను ఆమె ఓ పగగా మలచుకొని, అతడి పేరును వాడుతూ ఈ బెదిరింపు ఈమెయిళ్లు పంపిందని తెలిపారు. అంతేకాకుండా, అతడిపై అనేక నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించి వేధించిందని తెలిపారు.
రెనీ తన ఆచూకీ బయటపడకుండా ఉండేందుకు డార్క్ వెబ్, ప్రోటాన్‌మెయిల్, వీపీఎన్‌లు, వర్చువల్ నంబర్లు, పాక్ ఐపీలను ఉపయోగించింది. అయినప్పటికీ, సైబర్ క్రైం అధికారులు అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి ఆమెను చెన్నైలో గుర్తించి అరెస్ట్ చేశారు. 2021-22 నుంచే ఈమె ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. ఇప్పటికీ ఈ ఘటన వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.









