లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అద్భుత సెంచరీ నమోదు చేసి జట్టును నిలకడగా ముందుకు నడిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో చేసిన శతకంతో పాటు, రెండో ఇన్నింగ్స్‌లోనూ తన ఫామ్‌ను కొనసాగించడంతో క్రికెట్ అభిమానుల్ని అలరించాడు. కానీ ఈసారి శతకం తర్వాత పంత్ చేసిన సెలబ్రేషన్ అంచనాలకు మించినదిగా మారింది.
తొలి ఇన్నింగ్స్‌లో శతకం చేసినప్పుడు పంత్ గాల్లోకి సోమర్సాల్ట్ చేసి సంబరాలు జరిపాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో కూడా అలాంటి ఏదైనా చేయబోతున్నాడని అభిమానులు, కామెంటేటర్లు ఆశించారు. అంతే కాకుండా, లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా కామెంటరీలో “పంత్ మళ్లీ సోమర్సాల్ట్ చేస్తే బాగుంటుంది” అని వ్యాఖ్యానించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, పంత్ కొత్తగా ‘డెలీ అలీ’ సెలబ్రేషన్‌కు తెరలేపాడు.
ఈ సెలబ్రేషన్ లో పంత్ తన కుడిచేతి బొటన వేలు, చూపుడు వేలు కలిపి కళ్ల ముందు పెట్టుకుని చూడటంలా ఒక స్పెషల్ సైగ చేశాడు. ఇది సరదాగా కనిపించినా, ఇది ఆంగ్ల ఫుట్‌బాల్ స్టార్ డెలీ అలీ చేసిన ప్రాచుర్యం పొందిన గెస్ట్చర్. 2018లో టోటెన్హమ్ తరఫున గోల్ చేసిన సమయంలో డెలీ అలీ ఇదే తరహాలో సెలబ్రేట్ చేశారు. అప్పుడు ఈ సెలబ్రేషన్ సోషల్ మీడియాలో ఓ ట్రెండ్‌గా మారింది. ఎందరో యువత ఈ గెస్ట్చర్ను అనుకరిస్తూ ఫోటోలు, వీడియోలు పోస్టు చేశారు.
కాలక్రమేణా ఈ ట్రెండ్ తగ్గిపోయినప్పటికీ, పంత్ అప్రత్యక్షంగా దీన్ని తిరిగి తెరపైకి తీసుకొచ్చినట్టు అయింది. క్రికెట్ మైదానంలో ఫుట్‌బాల్ గెస్ట్చర్ చేయడం అరుదైన విషయం. పంత్ ఎందుకు ఈ సెలబ్రేషన్ ఎంచుకున్నాడన్నది స్పష్టంగా తెలియకపోయినా, అతడి అద్భుత బ్యాటింగ్‌కు తోడు ఈ వినూత్న సంబరం అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు క్రీడా వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది.









