ప్రముఖ నటుడు మంచు విష్ణు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘కన్నప్ప’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలోని విష్ణు నటన, విజువల్స్ మరియు కథనం పలువురి హృదయాలను గెలుచుకున్నాయి. తాజాగా ఈ సినిమాపై తమిళ స్టార్ హీరో సూర్య ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా విజయాన్ని పురస్కరించుకుని విష్ణుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఒక పూల బొకేతో పాటు వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాన్ని పంపారు.
సూర్య తన సందేశంలో, “ఈ అద్భుతమైన మైలురాయికి బిగ్ కంగ్రాచ్యులేషన్స్ బ్రదర్ విష్ణు. నీ ప్యాషన్, కష్టం, నమ్మకం ఫలించాయి. ఎన్నో హృదయాలను హత్తుకునే సినిమా తీసినందుకు గర్వంగా ఉంది” అని పేర్కొన్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, సినీ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ ప్రశంసలకు స్పందిస్తూ మంచు విష్ణు సోషల్ మీడియాలో స్పందించారు. “బిగ్ బ్రదర్ సూర్య! మీ సందేశానికి హృదయపూర్వక ధన్యవాదాలు. నేను స్ఫూర్తి పొందే వ్యక్తుల్లో మీరు ముందు వరుసలో ఉన్నారు. మీలాంటి వ్యక్తి నుంచి ఈ అభినందనలు రావడం నాకు గర్వకారణం” అంటూ ఎమోషనల్ రిప్లై ఇచ్చారు. ఆయన అభిమానులు ఈ స్పందనను ఆనందంగా పంచుకుంటున్నారు.
ఇదిలా ఉండగా, ‘కన్నప్ప’ పైరసీ బారిన పడిందని మంచు విష్ణు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రియమైన సినీ ప్రియులారా, కన్నప్పపై పైరసీ దాడి జరుగుతోంది. ఇప్పటికే 30,000 పైగా చట్టవిరుద్ధమైన లింకులను తొలగించాం. ఇది చాలా బాధాకరం. పైరసీ అంటే దొంగతనమే. దయచేసి దానిని ప్రోత్సహించకండి. సరైన మార్గంలో సినిమాను ఆదరించండి” అంటూ ప్రేక్షకులను కోరారు. సినీ ప్రేమికులు ఆయన పిలుపుకు సానుకూలంగా స్పందిస్తున్నారు.









