భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర స్థావరాలపై విధ్వంసకర దాడులు జరిపి నెల కూడా గడువకముందే పాకిస్థాన్ మళ్లీ అదే స్థావరాలను పునరుద్ధరించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పాక్ సైన్యం, ఐఎస్ఐ, ప్రభుత్వ సాయంతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ధ్వంసమైన లాంచ్ప్యాడ్లను తిరిగి నిర్మిస్తూ ఉగ్రవాదులను సిద్ధం చేస్తున్నట్లు నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. దాడుల తర్వాత కూడా పాక్ ఉగ్ర మద్దతు కొనసాగిస్తోందని ఇది రుజువు చేస్తోంది.
మే 7న భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో జేఈఎం ప్రధాన కేంద్రం బహావల్పూర్, ఎల్ఈటీ శిబిరం మురిద్కే సహా తొమ్మిది ఉగ్ర స్థావరాలపై క్షిపణి దాడులు జరిపింది. ఈ దాడుల్లో 100 మంది పైగా ఉగ్రవాదులు హతమయ్యారని, మ్యాక్సార్ ఉపగ్రహ చిత్రాల ద్వారా ధ్రువీకరణ కూడా లభించిందని అధికారులు వెల్లడించారు. దీని తర్వాత పాక్ మారుతుంది అనుకున్నప్పటికీ పరిస్థితి భిన్నంగా మారింది.
ప్రస్తుతానికి పాక్ ఆక్రమిత కశ్మీర్, ఎల్ఓసీ వెంబడి దట్టమైన అడవుల్లో చిన్న, ఆధునిక ఉగ్ర శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి ఉపగ్రహం ద్వారా సులభంగా గుర్తించబడకుండానే ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడుతాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, టీఆర్ఎఫ్ వంటి సంస్థల కోసం ఈ సౌకర్యాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
భారతం ధ్వంసం చేసినప్పటికీ, పుల్వామా దాడికి ఉపయోగపడిన జైషే మహమ్మద్ మదరసాలోని స్విమ్మింగ్ పూల్‌ను మళ్లీ ప్రారంభించడం పాక్ ధీటైన ఉగ్ర ప్రోత్సాహాన్ని సూచిస్తోంది. 2019 పుల్వామా దాడికి ప్రధానంగా పాల్గొన్న ఉగ్రవాదులు ఇదే పూల్‌లో శిక్షణ పొందారు. భారత్‌లోకి దూసుకెళ్లే ముందు ఈ స్విమ్మింగ్ టెస్ట్ పాస్ కావడం తప్పనిసరి. ఇలాంటి కీలక శిక్షణ కేంద్రం ధ్వంసమైన నెలరోజుల్లోనే తిరిగి పునరుద్ధరించడం పాక్ ఉగ్ర పోషక ధోరణికి పెద్ద ఉదాహరణగా నిలుస్తోంది.









