కర్ణాటక కాంగ్రెస్‌లో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడ్డాయి

Dissent brews in Karnataka Congress; MLAs criticize CM Siddaramaiah, prompting high command’s intervention.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఇరకాటంలోకి నెట్టారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అదృష్టం వల్లే సీం అయ్యారని ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో భిన్న స్వరాలకు దారితీశాయి. “సిద్ధరామయ్యకు లాటరీ తగిలింది. ఆయన్ను సోనియాగాంధీకి పరిచయం చేసిందె నేను. ఆయన అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయ్యారు” అంటూ బీఆర్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల వీడియో బయటకు రావడంతో కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేగింది.

బీఆర్ పాటిల్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనదైన శైలిలో స్పందించారు. “అవును.. నేను అదృష్టవంతుడినే. అందుకే ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాను” అని సూటిగా బదులిచ్చారు. ఈ సమాధానం కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చలకు దారి తీసింది. సీఎం పదవికి సంబంధించి అసంతృప్తి స్పష్టమవుతుండటంతో రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి.

ఈ వివాదానికి కారణం బీఆర్ పాటిల్ చేసిన అవినీతి ఆరోపణలు. తన నియోజకవర్గం అలంద్‌లో పేదలకు ఇళ్ల కేటాయింపులో అవినీతి జరిగిందని ఆయన మండిపడ్డారు. అయితే గృహనిర్మాణ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ ఈ ఆరోపణలను ఖండించారు. “కేటాయింపులు పూర్తిగా పారదర్శకంగా జరిగాయి” అని స్పష్టం చేశారు. ఈ వివాదం కొనసాగుతుండగానే మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజు కాజే, బేలూర్ గోపాలకృష్ణ కూడా ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యేల అసమ్మతి క్రమంగా పెరుగుతుండటంతో కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సూర్జేవాలాను బెంగళూరుకు పంపి అసంతృప్త ఎమ్మెల్యేలతో చర్చలు జరిపించారు. అనంతరం మీడియాకు ఇచ్చిన ప్రకటనలో “రాష్ట్రంలో నాయకత్వ మార్పు లేదు. సీఎం మార్పుపై వస్తున్న ఊహాగానాల వెనుక బీజేపీ కుట్ర ఉంది” అని ఆరోపించారు. కాంగ్రెస్ అందిస్తున్న గ్యారంటీలను అడ్డగించేందుకే బీజేపీ ఈ రకాల ప్రచారాలు చేస్తోందని సూర్జేవాలా ధ్వజమెత్తారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share