సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల అమలు చారిత్రక నిర్ణయం

Supreme Court announces reservations for SC, ST staff—marks historic step for social justice and representation.

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సిబ్బంది నియామకాలు, పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను అధికారికంగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా సుప్రీంకోర్టు ఈ విధంగా సమానతకు, సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసింది. జూన్ 24న జారీ చేసిన సర్క్యులర్ ద్వారా ఈ నిర్ణయం వెలువడింది. జూన్ 23 నుంచి అమల్లోకి వచ్చినట్లు సర్క్యులర్‌లో స్పష్టం చేశారు.

రెగ్యూలర్ నియామకాలు, పదోన్నతుల్లో ఎస్సీ వర్గానికి 15 శాతం, ఎస్టీ వర్గానికి 7.5 శాతం రిజర్వేషన్ వర్తింపచేయనున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విధానం రిజిస్ట్రార్లు, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ లైబ్రేరియన్లు, జూనియర్ కోర్టు అసిస్టెంట్లు, ఛాంబర్ అటెండెంట్లు వంటి పలు స్థాయిల్లోని పోస్టులకు వర్తించనుంది. రిజర్వేషన్ల వివరాలను ‘సుప్‌నెట్’ అనే అంతర్గత నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

పూర్తి పారదర్శకతతో రిజర్వేషన్ల అమలు జరగాలని, ఎక్కడైనా లోపాలు కనిపిస్తే సిబ్బంది నేరుగా రిజిస్ట్రార్ (రిక్రూట్‌మెంట్) దృష్టికి తీసుకురావచ్చని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ఎవరికీ అన్యాయం జరగకుండా చూసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సుప్రీంకోర్టు తెలియజేసింది. రిజర్వేషన్ అమలు ద్వారా కోర్టు లోని సిబ్బందిలో సామాజిక సమతుల్యతకు మార్గం సుగమమవుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్ బీఆర్ గవాయి హయాంలోనే ఈ చారిత్రక నిర్ణయం వెలువడటం గమనార్హం. షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిగా సుప్రీంకోర్టు సీజేఐగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రెండో వ్యక్తిగా జస్టిస్ గవాయి చరిత్ర సృష్టించారు. ఆయన నేతృత్వంలోనే సుప్రీంకోర్టు సామాజిక న్యాయం, సమాన హక్కుల పరిరక్షణ దిశగా ఒక కీలక అడుగు వేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share