తెలంగాణకు సంబంధించిన నీటి హక్కులను రక్షించడంలో కేసీఆర్, హరీశ్ రావులు ఘోరంగా విఫలమయ్యారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం ప్రజాభవన్‌లో ‘గోదావరి-బనకచర్ల’ అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2015లోనే వీరు చేసిన సంతకాలే తెలంగాణకు తీరని నష్టం కలిగించాయన్నారాయన. గత ప్రభుత్వంలో పదేళ్ల పాటు నీటిపారుదల శాఖను వీరే పర్యవేక్షించారని, అయినప్పటికీ రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాపాడడంలో విఫలమయ్యారని రేవంత్ విమర్శించారు.
కృష్ణా జలాల విషయంలో మొత్తం 811 టీఎంసీలలో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలతో సరిపోతుందంటూ అప్పట్లో సంతకాలు చేసి ఆంధ్రప్రదేశ్‌కు మిగతా 68 శాతం నీటిని కేటాయించడానికి వీరే అనుమతి ఇచ్చారని రేవంత్ ఆరోపించారు. కృష్ణా నది పరివాహక ప్రాంతం ప్రకారం చూస్తే వాస్తవానికి తెలంగాణకు అధిక వాటా దక్కాల్సిందని, కానీ అలా జరుగకపోవడం రాష్ట్రానికి అన్యాయమని ఆయన వివరించారు.
రాష్ట్రానికి కేటాయించిన 299 టీఎంసీల నీటిని కూడా పూర్తి స్థాయిలో వాడుకోవడానికి అవసరమైన ప్రాజెక్టులను పూర్తి చేయడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని రేవంత్ మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన ప్రాజెక్టులను పట్టించుకోకపోవడం వల్లే ఈ దుర్దశి తలెత్తిందని తెలిపారు. ప్రాజెక్టుల పూర్తి చేయడంలో నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ రైతులు కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటైనా రాష్ట్రానికి దక్కిన హక్కులను సాధించేందుకు రాజకీయంగా, సాంకేతికంగా, న్యాయపరంగా అన్ని విధాలుగా పోరాడతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకుని నీటిని తరలించుకుంటుండగా, తెలంగాణ మాత్రం వెనుకబడుతోందని, ఇప్పుడు తమ ప్రభుత్వం వాటిని ఎదుర్కొని నీటి హక్కులను సాధించడమే లక్ష్యంగా పనిచేస్తోందని ఆయన తేల్చిచెప్పారు.









