మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత, జంషెడ్‌పూర్ మాజీ ఎంపీ డాక్టర్ అజయ్ కుమార్ కేంద్ర బీజేపీ ప్రభుత్వ విదేశాంగ విధానంపై తీవ్ర విమర్శలు చేశారు. పొరుగు దేశాలతో భారత్ సంబంధాలు దెబ్బతింటున్నాయని ఆరోపిస్తూ నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల పేర్లు ప్రస్తావించారు. అయితే, ఈ సందర్భంలో ఆయన పొరపాటున సిక్కిం పేరును కూడా ఆ జాబితాలో చేర్చారు. భారత్‌లో 50 ఏళ్ల క్రితమే విలీనమైన సిక్కింను విదేశం జాబితాలో చేర్చడం తీవ్ర దుమారానికి దారితీసింది.
అజయ్ కుమార్ వ్యాఖ్యలపై బీజేపీతో పాటు సిక్కిం అధికార పార్టీ సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్కేఎం) కూడా ఘాటు స్పందన వ్యక్తం చేశాయి. బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఈ వ్యాఖ్యలు సిక్కింకే కాకుండా మొత్తం ఈశాన్య భారత ప్రజలకు అవమానకరంగా ఉన్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ జిన్నా సిద్ధాంతాన్ని అనుసరిస్తోందని, దేశాన్ని మళ్లీ విభజించాలన్న ఆలోచనతోనే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు, సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రెస్ సెక్రటరీ యుగన్ తమాంగ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక జాతీయ పార్టీ సీనియర్ నేతకు దేశ భౌగోళిక, చారిత్రక అంశాలపై కనీస అవగాహన లేకపోవడం దారుణమని, ఇది సిక్కిం ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయడానికి సరిపోతుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం వెంటనే అజయ్ కుమార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వివాదం ముదరడంతో అజయ్ కుమార్ బుధవారం సోషల్ మీడియాలో స్పందించారు. ఆయన తన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరుతూ “నిన్న ప్రెస్ మీట్‌లో పొరుగు దేశాలపై మాట్లాడుతున్నప్పుడు సిక్కిం పేరును పొరపాటున చెప్పేశాను. ఇది పూర్తిగా నోరు జారిన తప్పిదం. సిక్కిం ప్రజల మనోభావాలను గౌరవిస్తూ క్షమాపణలు కోరుతున్నాను” అంటూ పోస్టు చేశారు. కానీ ఆయన క్షమాపణ సరిపోదని, కాంగ్రెస్ పార్టీ నుంచి స్పష్టమైన చర్యలు కావాలని బీజేపీ, ఎస్కేఎం నిర్ధారిస్తూనే ఉన్నాయి.









