జునైద్ ఖాన్ సింప్లిసిటీపై అమీర్ గర్వం

Aamir Khan expresses pride over son Junaid’s modest lifestyle, preferring buses and autos despite star kid status.

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తన కొడుకు జునైద్ ఖాన్ సాధారణ జీవనశైలిపై గర్వం వ్యక్తం చేశారు. ‘మహారాజ్’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన జునైద్ ఖాన్ స్టార్ కిడ్ అయినా, లగ్జరీకి దూరంగా ప్రజా రవాణాలో ప్రయాణిస్తుండటంపై తాజాగా అమీర్ స్పందించారు. తన కొడుకు ఇంతవరకూ సొంతంగా కారు కూడా కొనలేదని, బస్సులు, ఆటోల్లోనే తిరుగుతాడని తెలిపారు. “జునైద్‌కు అవసరమైతే నా కార్లు తీసుకోవచ్చని ఎంతసార్లు చెప్పినా, అతను ఓలా బుక్ చేసుకుంటానని సమాధానం ఇస్తాడు” అని అమీర్ అన్నారు.

జునైద్ తక్కువ ఖర్చుతో, సౌలభ్యంగా ప్రజా రవాణాను ఎంచుకునే అలవాటుపై ఒక సంఘటనను గుర్తు చేశారు. “ఒకసారి జునైద్ కేరళ నుంచి బెంగళూరుకు స్నేహితుడి పెళ్లికి వెళ్ళాల్సి వచ్చింది. ఏ ఫ్లైట్‌లో వెళ్తావని అడిగితే రాత్రికి ప్రభుత్వ బస్సు బుక్కింగ్ చేసుకున్నానన్నాడు. వాడి అలా ఆలోచించడం విచిత్రంగానే అనిపించినా, మేము పిల్లలను డబ్బుకంటే విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ పెంచాము” అని చెప్పారు.

కరోనా సమయంలో జునైద్ చేసిన సేవాగుణం గురించి కూడా అమీర్ గుర్తుచేసుకున్నారు. “నా మాజీ భార్య రీనా తల్లిదండ్రులు కరోనా బారిన పడగా, జునైద్ వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి దాదాపు రెండు వారాల పాటు పూర్తిగా వారిని చూసుకున్నాడు. ఇంట్లో సహాయం లేకుండా ఒంటరిగా సర్వీస్ చేశాడు. ఆ సమయంలో అతని సున్నితమైన మనసు, బాధ్యత చూసి నేను గర్వపడిపోయాను” అని భావోద్వేగంగా వివరించారు.

తన సింప్లిసిటీపై వచ్చిన చర్చకు జునైద్ కూడా స్పందించాడు. “నాన్న చిన్న విషయాలను కూడా పెద్దవి చేసి చెబుతారు. అసలు విషయమేంటంటే, ముంబై ట్రాఫిక్‌లో గంటల తరబడి వృథా చేసే బదులు ట్రైన్‌లో సులభంగా వెళ్లిపోవచ్చు. అలాగే పార్కింగ్ సమస్యలు లేకుండా ఆటోల్లో చక్కగా తిరుగుతాను. ఇవన్నీ సౌకర్యం కోసమే చేస్తున్నాను” అంటూ తన ఆచరణాత్మక దృష్టికోణం వివరించాడు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share