కుప్పం నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం బృహత్తర ప్రణాళికలు చేపట్టింది. ఆలయాల పునరుద్ధరణకు రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయగా, అన్ని ఆలయాలను దశలవారీగా అభివృద్ధి చేయడానికి చర్యలు కొనసాగుతున్నాయి. గోశాలల ఏర్పాటులో భాగంగా గోకులం షెడ్లు పెద్ద ఎత్తున నిర్మించబడ్డాయి. ప్రతీ ఇంటికి ఆవులు అందజేసి ప్రతి కుటుంబానికి అదనపు ఆదాయం కల్పిస్తున్నారు. రాబోయే రోజుల్లో కుప్పం నుంచి రోజుకు 10 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతాయని అంచనా వేస్తున్నారు.
కుప్పం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, 130 ఇ-ఆటోల ద్వారా తడి, పొడి చెత్త సేకరణ చేపడుతున్నారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ ఆటోలతో చెత్త సేకరిస్తున్న తొలి నియోజకవర్గంగా కుప్పం నిలిచింది. సుందరమైన పరిసరాలు, పరిశుభ్రతతో కుప్పంను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. పర్యాటకం అభివృద్ధితో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు.
రాయలసీమ హార్టీ కల్చర్ హబ్‌గా ఎదగడానికి కుప్పం దిక్సూచిగా మారుతుందని అధికారులు పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. స్థానిక యువతకు అవసరమైన స్కిల్స్ నేర్పి, కార్పొరేట్, ఇతర పరిశ్రమలతో అనుసంధానం చేస్తున్నారు. దీని ద్వారా నియోజకవర్గ యువతకు స్థిరమైన ఆదాయ మార్గాలు ఏర్పడుతున్నాయి.
కుప్పంలో డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బిల్ గేట్స్ ఫౌండేషన్, టాటా సంస్థలతో కలిసి ఈ ప్రాజెక్టును పైలట్ విధంగా అమలు చేస్తున్నారు. జననాయకుడు పోర్టల్ ద్వారా నియోజకవర్గ సమస్యలకు పరిష్కారం అందించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. కుప్పంలో 10,393 బంగారు కుటుంబాలను గుర్తించి, వారందరికీ మార్గదర్శకులను అనుసంధానం చేయాలని నిర్ణయించారు.









