మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి సేవలను గౌరవిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం జూలై 4న ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించనున్నట్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు పాల్గొని నివాళులు అర్పించాల్సిందిగా ఆదేశాలు జారీయ్యాయి. ఈ కార్యక్రమ బాధ్యతలను పర్యాటక, సాంస్కృతిక శాఖకు అప్పగించారు.
రోశయ్య గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో 16 సార్లు ఆర్థికశాఖ మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత సాధించారు. ఆర్థిక పరిపాలనలో ఆయన చూపిన సామర్ధ్యం అందరికి ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రం అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువలేనిదని ప్రభుత్వం పేర్కొంది. జయంతి రోజున ఆయన సేవలను గుర్తు చేసుకోవడం ద్వారా యువతకు స్ఫూర్తి కలిగించాలని భావిస్తున్నారు.
రోశయ్య నివాసం ఉన్న ధరమ్ కరం రోడ్డులో ఒక వీధికి ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే, ఆయన ఇంటికి సమీపంలో ఉన్న నేచర్ క్యూర్ ఆసుపత్రికి కూడా రోశయ్య పేరు ఇవ్వనుంది. ఈ మార్పులు రోశయ్య గారి సేవలకు గుర్తింపు ఇవ్వడమే లక్ష్యంగా చేపడుతున్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
అదే విధంగా, లకిడికాపూల్ చౌరస్తాలో రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విగ్రహం ద్వారా రోశయ్య గారి సేవలను భావితరాలకు గుర్తు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. జయంతి ఉత్సవాలు ప్రతియేటా ఘనంగా నిర్వహించి ఆయనను స్మరించుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.









